వారం రోజుల్లో కోటి రూపాయల జరిమానాలు!

Update: 2021-12-26 06:47 GMT
హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండే వివిధ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్క వారంలోనే భారీగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 వరకు సుమారు 34 వేల మందికి పైగా ట్రాఫిక్ ఆంక్షలు  తుంగలో తొక్కి ఉన్నట్లు పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండే ఉండే వివిధ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో వీరిపై కేసులు రిజిస్టర్ అయినట్లు వివరించారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు భారీగా జరిమానా విధించారు. ఈ  ఉల్లంఘనలకు సంబంధించి సుమారు కోటి ముప్పై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు వసూలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేవలం ఒక్క వారం  రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ లు వేయడం అనేది ప్రజలు కూడా గమనించాలన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించేందుకు ట్రాఫిక్ సిబ్బంది కృషి చేస్తున్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అంతేగాకుండా ప్రజలు రాకపోకలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరగాలంటే నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన  పేర్కొన్నారు. ఇందుకుగానూ తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫైన్ లు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తూ..  వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు డీసీపీ తెలిపారు. కేవలం ఈ వారం రోజుల్లోనే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉండే వివిధ ప్రాంతాల్లో సుమారు వందకు పైగా  ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. వారిలో చాలా మంది గాయపడగా.. మరి కొందరు చనిపోయినట్లు వివరించారు. ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 15 గా ఉంటే  క్షతగాత్రుల సంఖ్య మాత్రం 85 కు చేరినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో పోలీసులు విధిస్తున్న జరిమానాల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు చాలా అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను ట్రాఫిక్ సిబ్బంది ట్విట్టర్ లో షేర్ చేశారు. వీరు నంబర్ ప్లేట్ కు మాస్క్ ని పెట్టి జరిమానాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కొంత మంది అయితే ఏకంగా లైట్ పెయింట్ ను  నంబర్ ప్లేట్ పై వేస్తున్నారు.
Tags:    

Similar News