కాంగ్రెస్ లోకి జేసీ మరియు డీఎల్

Update: 2021-08-11 05:49 GMT
ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావ‌న వ‌స్తే. . అధికార పార్టీ వైసీపీ, ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన‌, అప్పుడ‌ప్పుడు బీజేపీ పేర్లు మాత్ర‌మే వినిపిస్తున్నాయి. అదేంటీ.. అక్క‌డ మ‌రో ప్ర‌ధాన పార్టీ కూడా ఉండాలే అనే సందేహం క‌లిగిందా? అవును.. ఉండాలి. ఆ పార్టీనే కాంగ్రెస్‌. కానీ ఇప్పుడ‌క్క‌డ ఆ పార్టీ ఉనికి పెద్ద‌గా లేద‌నేది కాద‌న‌లేని నిజం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విభ‌జించి ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ‌ను ఏర్పాటు చేశార‌నే అక్క‌డి ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్‌పై కోపం ఉంది. అందుకే 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అక్క‌డ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయింది. కానీ ఆ రాష్ట్రంపై ప్ర‌త్యేక దృష్టి సారించి స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుల నేతృత్వంలో తిరిగి కార్య‌క‌ర్త‌ల్లో న‌మ్మ‌కం తేగ‌లితే పార్టీ పుంజుకునే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్పుడా ఆ దిశ‌గా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఒక‌ప్పుడు ద‌క్షిణ భార‌త‌దేశంలో కాంగ్రెస్ ఆధిప‌త్యం చ‌లాయించేదే. ఆ పార్టీకి బ‌లం కూడా ద‌క్షిణాది రాష్ట్రాలే. కానీ ఆ త‌ర్వాత నెల‌కొన్న వివిధ ప‌రిణామాలు, అధిష్ఠానం వైఫ‌ల్యం క‌లిసి అధికారాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగింది. వ‌రుస‌గా రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్‌.. ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయారు. కానీ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆ పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. ఉమ్మ‌డి ఏపీని విభ‌జించార‌ని కోపంతో కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు ఓట్లేయ‌డం మానేశారు. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ‌లోనైనా అధికారం ద‌క్కించుకుందామ‌ని చూసినా.. అనూహ్యంగా వ్య‌తిరేకంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ప‌రిస్థితి రెట్టికి చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. తెలంగాణ‌లో ఇప్పుడు ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డిని నియ‌మించ‌డంతో పార్టీ దూకుడు పెంచింది. ఇప్పుడు ఏపీపై ధ్యాస పెట్టింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు అధిష్టానం క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ని తెలిసింది. అక్క‌డ పార్టీని బ‌లోపేతం చేస్తే ఎప్ప‌టికైనా అధికారంలోకి వ‌చ్చే అవకాశం ఉంద‌ని పార్టీ భావిస్తోంది. అందుకే ఆ పార్టీ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌త‌న సీనియ‌ర్ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలో ఏపీ కాంగ్రెస్‌పై ప‌లు నిర్ణ‌యాలు తీసుకునే ఆస్కార‌ముంది. ప్ర‌స్తుతం పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న శైల‌జానాథ్ స్థానంలో కొత్త‌వాళ్ల‌ను తీసుకొస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు రాష్ట్రంలోని రెడ్డి వ‌ర్గం అధికార వైసీపీపై వ్య‌తిరేకంగా ఉంద‌ని అందుకే ఒక‌ప్ప‌టి రెడ్డి నాయ‌కుల‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకువ‌స్తే పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని ఎన్నిక‌ల‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ స‌ల‌హా ఇచ్చిన‌ట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మాజీ మంత్రులైన జేసీ దివాక‌ర్ రెడ్డి, డీఎల్ ర‌వీంద్ర రెడ్డిల‌ను తిరిగి సొంత‌గూటికి ఆహ్వానించే అవ‌కాశం ఉంది. వీళ్ల‌ను మొద‌ట తీసుకుని వ‌స్తే ఆ త‌ర్వ‌త రాయ‌ల‌సీమ‌లోని మిగ‌తా సీనియ‌ర్ నాయ‌కులు పార్టీవైపు మొగ్గుచూపే వీలుంద‌ని అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఆ బాధ్య‌త‌ను మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డికి అప్ప‌గించే ఆలోచ‌న చేస్తుంద‌ని దిల్లీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ ప్ర‌య‌త్నాల‌న్నీ ఫ‌లించి తిరిగా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో తిరిగి మునుప‌టి వైభ‌వం వ‌స్తుందేమో చూడాలి.





Tags:    

Similar News