మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఇంటి కరెంట్ కనెక్షన్ కట్..?

Update: 2020-09-19 05:30 GMT
ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్. తాజాగా ఆయన అధికార నివాసానికి ఉన్న కరెంటు కనెక్షన్ ను కట్ చేసిన విద్యుత్ అధికారుల తీరు సంచలనంగా మారింది. అయితే.. ఇదంతా టెక్నికల్ అంశాలతోనే జరిగినట్లుగా చెబుతున్నా.. విద్యుత్ సిబ్బంది వినిపిస్తున్న వాదన మాత్రం సబబుగా లేదన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ.. జిల్లా కలెక్టర్ ఇంటి కరెంట్ కనెక్షన్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందన్న విషయంలోకి వెళితే..

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా 2016లో మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినా.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన వసతుల్ని ఏర్పాటు చేయలేదు. జిల్లా కలెక్టర్ తో పాటు.. ఎస్పీ తదితర ఉన్నతాధికారులకు కల్పించాల్సిన అధికార బసకు తగిన భవనాలు చాలాచోట్ల లేవు.

మంచిర్యాల జిల్లా లోనూ అలాంటి పరిస్థితే. దీంతో.. జిల్లా కేంద్రం లోని ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ లో నిర్మించిన ఇళ్లను కలెక్టర్ తో పాటు.. పలువురు ఉన్నతాధికారులకు కేటాయించారు. ఇదిలా ఉంటే.. ఎంసీసీ ఫ్యాక్టరీ యాజమాన్యం గడిచిన రెండేళ్లు గా కరెంటు బిల్లు కట్టటం లేదు. దాదాపు రూ.2కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కరెంటు బిల్లు కట్టని నేపథ్యం లో.. సిమెంట్ ఫ్యాక్టరీ కి కరెంట్ కట్ చేశారు.

అయితే.. అదే విద్యుత్ లైన్ జిల్లా కలెక్టర్ తో పాటు.. ఇతర ఉన్నతాధికారులకు కూడా ఉండటంతో.. వారంతా విద్యుత్ లేని సమస్యను ఎదుర్కొన్నారు. ఎందుకిలా జరిగిందన్న ఆరా తీయగా.. బకాయిల వ్యవహారం బయటకు వచ్చింది. జిల్లా ఉన్నతాధికారులు బసను సిమెంట్ ఫ్యాక్టరీ వారి క్వార్టర్ల లో ఏర్పాటు చేసిన విషయం విద్యుత్ సిబ్బంది కి అవగాహన ఉందంటున్నారు.

ఒకవేళ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కరెంట్ బిల్లు కట్టకుంటే.. వారి మీద చర్యలు తీసుకునే క్రమంలో కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ జరగక పోవటం గమనార్హం. ఎప్పుడైతే.. విద్యుత్ సరఫరా ను నిలిపి వేయటం.. అధికారులు ఆరా తీయటం షురూ చేసిన వెంటనే.. జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేపట్టారు విద్యుత్ శాఖ సిబ్బంది. అప్పటికప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ తో సంబంధం లేకుండా.. ప్రత్యేక విద్యుత్ లైన్ ను జిల్లా కలెక్టర్ నివాసాలకు వేశారు. ఆ పనేదో.. ముందే చేపట్టి ఉంటే బాగుండేది కదా? అన్న మాట వినిపిస్తోంది. 
Tags:    

Similar News