'విక్రమ్' మూవీ చూసి వేళ్లు కట్ చేశాడట.. షాకింగ్ నిజం బయటకు

Update: 2023-03-01 16:00 GMT
ప్రాణస్నేహితుడు తన గాళ్ ఫ్రెండ్ తో చనువుగా ఉంటున్నాడన్న కోపంతో అత్యంత దారుణంగా.. కిరాతకంగా హతమార్చిన షాకింగ్ ఉదంతం పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఈ దారుణ హత్యకు సంబంధించి పోలీసుల విచారణలో నిందితుడు హరిహర క్రిష్ణ వెల్లడించిన వివరాలు షాకింగ్ గా మారాయి. కోపంతో.. ఆవేశంతోనో హత్యలు చేయటం వేరు.

అందుకు భిన్నంగా మూడు నెలల పాటు ప్లాన్ చేసి.. ఎలా చంపాలన్న దానిపై పూర్తి క్లారిటీతో.. పలుమార్లు రెక్కీ నిర్వహించి మరీ ఘోరంగా చంపేసిన వైనం ఇప్పుడు అందరిని నిర్ఘాంతపోయేలా చేస్తోంది. నిండా ఇరవైఏళ్లు కూడా లేని చిరుప్రాయంలో ప్రాణ స్నేహితుడిని మరీ అంతలా చంపాలా? అన్నది ప్రశ్న.

స్నేహితుడు నవీన్ ను హత్య చేసిన తర్వాత.. అతడి ఒంట్లోని అవయువాల్ని తీసి.. వాటిని వాట్సాప్ లో తన గాళ్ ఫ్రెండ్ కు పంపిన పైశాచికత్వం గురించి విన్నంతనే ఒళ్లు జలదరింపునకు గురి కాక మానదు. ఎందుకిలా చేశావు? చంపిన తర్వాత అలా ఒంట్లోని అవయువాల్ని ఎందుకు వెలికి తీశావు? అన్న ప్రశ్నను సంధించినప్పుడు.. "నా కసి తీర్చుకోవటానికి అలా చేశా" అని బదులిచ్చినట్లుగా తెలుస్తోంది. మరి.. వేళ్లను కట్ చేయటం ఏమిటి? అంటే.. తాను విక్రమ్ సినిమాలో వేళ్లు కట్ చేసే సీన్ తో స్ఫూర్తి పొందినట్లుగా చెప్పి.. ఆధారాలు లభించకుండా ఉండేందుకే వేళ్లను కట్ చేసినట్లుగా పేర్కొన్నాడు.

విక్రమ్ సినిమా దర్శకుడు అంటే మహా ఇష్టమని.. అతడు తీసిన సినిమాలో క్రైం సీన్లు తనకు బాగా నచ్చినట్లుగా చెప్పి.. వేళ్లను ఆ మూవీలో మాదిరి కట్ చేయాలని చేసినట్లుగా పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. విక్రమ్ సినిమాలో విలన్ సహాయకుడు పట్ కారుతో కాలి వేళ్లను కట్ చేసి.. మళ్లీ నడవకుండా చేసి.. చంపేస్తాడు. రీల్ సీన్ కు భిన్నంగా.. తన ప్రాణ స్నేహితుడ్ని హతమార్చిన తర్వాత.. చేతి వేళ్లు ఉంటే.. ఆధార్ తో గుర్తించే ప్రమాదం ఉందన్న అనుమానంతోనే తాను వేళ్లను కట్ చేసినట్లుగా చెప్పటం గమనార్హం. అంతేకాదు మార్వెల్ స్టూడియో వారి సినిమాలంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు. సినిమాల వల్ల ఎవరూ పెద్దగా ప్రభావితం కాదని వాదించే వాళ్లు.. ఈ ఉదంతం గురించి విన్న తర్వాతైనా తమ అభిప్రాయాల్ని మార్చుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News