ఇలా కూడా దోచేస్తారు జాగ్రత్త!

Update: 2023-06-07 11:03 GMT
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ పేమెంట్ పుంజుకున్నాయి. ఒకప్పుడు పేమెంట్ చేయాలంటే బ్యాంక్ కు వెళ్లి చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూపీఐ ద్వారా యాప్ చాయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల పేమెంట్ వరకు క్షణాల్లో చెల్లించేస్తున్నాం. దీంతో పాటు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యాప్స్ సైతం కొత్త కొత్త ఫీచర్స్ తీసుకు వస్తున్నాయి. అయితే ఇదే అదనుగా భావించిన కేటుగాళ్లు కొత్త ప్లాన్స్ తో మన ఖాతాలోని సొమ్మును ఖల్లాస్ చేస్తున్నారు.

ఏమాత్రం డౌట్ రాకుండా అందిని కాడికి దోచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి.  విజయవాడ నగర శివారులో ఒక మహిళ తన ఇంటిని అద్దెకి ఇస్తానని  ఒక యాప్ లో ప్రకటన ఇచ్చింది. దీనికి ఓ వ్యక్తి నుంచి స్పందన వచ్చింది.

అద్దెకు మీ ఇంట్లో దిగుతానని చెప్పి ఆమెను నమ్మించాడు. తాను ఒక బిఎస్ఎఫ్ ఉద్యోగినని... గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తానంటూ మోసపు కబుర్లు చెప్పుకొచ్చాడు. ముందుగా అడ్వాన్స్ 5000 రూపాయిలు గూగుల్  పే ద్వారా పంపుతున్నట్లు ఆమెకి క్యూఆర్ కోడ్ ను పంపించాడు.

నమ్మిన ఆమె దానిని స్కాన్ చేసింది. ఇంకేముంది ఖాతాలోని మొత్తం డబ్బంతా దోచేసుకున్నాడు. ఇలాంటి ఘటనే మరొకటి కూడా కృష్ణ లంకలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఓ సైట్ లో తన ఇంటిని అద్దెకిస్తున్నట్టు ఆసక్తి ఉన్నవారు తనని సంప్రదించాలని ఫోన్ నెంబర్లు ఇచ్చింది.

ఓ వ్యక్తి ఫోన్ చేసి తమ కుటుంబం అద్దెకు దిగుతున్నట్లు ఆమెను నమ్మించాడు. అడ్వాన్స్ మొత్తాన్ని యూపీ ఆప్ ద్వారా 40 వేల రూపాయిలు పంపుతున్నానని... తాను క్యూఆర్ కోడ్ పంపుతున్నట్లు దానిని స్కాన్ చేయాలని చెప్పాడు.

 అది నిజమేనని నమ్మిన ఆమె తన ఫోన్ కు వచ్చిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసింది. డబ్బులు అన్ని మాయమైపోయాయి. మీకు డబ్బు పంపుతున్నామంటూ వాట్సాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను మోసగాళ్లు పంపుతున్నారు. దీనిని స్కాన్‌ చేస్తే నగదు, మీ ఖాతాలో జమ అవుతుందని నమ్మిస్తున్నారు. తీరా స్కాన్‌ చేస్తే..ఆ మేరకు డబ్బు ఖాతా నుంచి డెబిట్‌ అవుతోంది. ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు పోలిసులు చెబుతున్నారు. కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

Similar News