నివర్ తీరం దాటింది.. అయినప్పటికి డేంజర్ పోలేదు

Update: 2020-11-26 06:00 GMT
వణికించిన నివర్ తుపాను.. అంచనాలకు తగ్గట్లే.. తమిళనాడు మీద తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. చెన్నై మహానగరాన్ని ఆగమాగం చేసిన తుపాను.. బుధవారం రాత్రి 10-30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్యకాలంలో పుదుచ్చేరిలో తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుకాస్తా.. తీవ్ర తుపానుగా బలహీనపడింది.

అయినప్పటికీ నివర్ ప్రభావం కారణంగా ఈ రోజు (గురువారం) తమిళనాడు.. పుదుచ్చేరితోపాటు.. రాయలసీమ.. దక్షిణ కోస్తా ప్రాంతంతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల మీదా దీని ప్రభావం చూపనుంది. తుపాను తీరం దాటినతర్వాత కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారిని ముందస్తు జాగ్రత్తగా ఖాళీ చేయాలని ప్రభుత్వం కోరింది.

చెన్నై విమానాశ్రయంలో ఈ నెల 26 వరకు విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. చెన్నై నుంచి రైళ్ల రాకపోకల్ని రద్దు చేస్తూ.. రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. తుపాను తీరం దాటినప్పటికీ.. ఈ రోజు ఎక్కువగా.. రేపు కాస్త ప్రభావం ఉంటుందంటున్నారు. రానున్న రెండు రోజులు మత్య్సకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.
Tags:    

Similar News