జంపింగ్ ముహుర్తం పెట్టుకున్న డీఎస్‌!!

Update: 2018-09-26 17:41 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో హాట్ వార్త చ‌ర్చనీయాంశంగా మారింది. సీనియ‌ర్ నేత‌ - టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్  పార్టీ ఫిరాయింపే ఈ హాట్ అప్‌ డేట్. సీనియర్ నేత - రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ స‌స్పెన్ష‌న్ ఫిర్యాదు - అనంత‌రం ఆయ‌న స్పందించిన ఎపిసోడ్‌ అనూహ్య‌మైన మ‌లుపులు తిర‌గ‌డం తెలిసిన సంగ‌తే. పార్టీ వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డుతున్నారంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ - సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత స‌హా నిజామాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు సోనియాగాంధీ స‌హా ఇతర నేతలను ఢిల్లీలో కలుసుకోవడంతో పాటు - త్వరలో ఆ పార్టీలో చేరబోతారన్న వార్తలు రావ‌డం - డీఎస్ త‌న‌యుడు అర‌వింద్ బీజేపీలో దూకుడుగా ముందుకు వెళ్ల‌డం వంటివి ఇందుకు కార‌ణాల‌ని టీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఫిర్యాదు అనంత‌రం కొద్దికాలానికి ఆయ‌న తనయుడు సంజయ్‌ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదవ‌డం - అనంత‌రం ఆయ‌న అరెస్ట‌వ‌డం తెలిసిన సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ స‌ద్దుమ‌ణిగిన త‌రుణంలో తాజాగా డీఎస్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌ర‌లో ఆయ‌న త‌న సొంత గూడు అయిన కాంగ్రెస్‌ లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. అక్టోబర్‌ లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని కాంగ్రెస్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై డీఎస్ స్పందిస్తూ...``మీరు మంచి సమన్వయ కర్త - మీలాంటి వాళ్లు పార్టీకి చాలా అవసరమంటూ వెంటపడి మరీ కేసీఆర్‌ నన్ను టీఆర్ ఎస్‌ లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు పొమ్మనలేక పొగబెడుతున్నారు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయను. నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయండి. లేకుంటే నాపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోండి.' అని టీఆర్ ఎస్‌ అధిష్టానానికి తేల్చిచెప్పారు. దీంతో డీఎస్ ఏం చేయ‌నున్నార‌నే చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌చ్చింది. కాగా, డీఎస్‌ కు సంబంధించి కాంగ్రెస్ వ‌ర్గాలు కీల‌క వార్త‌ను ప్ర‌చారంలో పెట్టాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో తనపై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడం - మ‌రోవైపు టీఆర్ ఎస్‌‌ లో తనకు సరైన గుర్తింపు లేదని ఆవేదనగా ఉన్న నేప‌థ్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని డీఎస్ నిర్ణయం తీసుకున్నారని ఆ వ‌ర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మానససరోవర యాత్రలో ఉన్నందున చేరిక ఆల‌స్యం అవుతోంద‌ని - సెప్టెంబ‌ర్ 11వ తేదీ త‌ర్వాత జంపింగ్ ఉంటుంద‌ని గ‌తంలో ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ చేరిక‌ వాయిదాప‌డిన నేప‌థ్యంలో మ‌ళ్లీ కొత్త షెడ్యూల్‌ ను తెర‌మీద‌కు తెచ్చింది.

తాజా షెడ్యూల్ ప్ర‌కారం అక్టోబ‌ర్‌ లో ఆయ‌న చేరిక ఉండ‌నుంది. దేవీనవరాత్రుల సందర్భంగా డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని కాంగ్రెస్ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నారు. కాగా, డీఎస్ రాక‌తో కేసీఆర్ టార్గెట్‌ గా కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచనుంద‌ని తెలుస్తోంది. గులాబీ పార్టీలో కుటుంబ ఆదిప‌త్యం ఎలా సాగుతుందో తెలియ‌జెప్ప‌డం - నాయ‌కుల‌కు స్వేచ్ఛ లేని విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డం - ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను చాటిచెప్ప‌డం అంశాలను డీఎస్ రూపంలో చాటిచెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా, డీఎస్ రాకపై ప‌లువురు పార్టీ నేత‌లు పాజిటివ్‌ గా ఉన్న నేప‌థ్యంలో పార్టీ దూకుడుగా వెళ్ల‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.


Tags:    

Similar News