పార్టీలో చేరిన పదేళ్లకా..? 'చిన్నమ్మ'కు గుర్తింపు ఎన్నాళ్లకో..?

Update: 2023-07-04 17:07 GMT
ఎప్పుడో 2014లో పార్టీలో చేరితే.. దాదాపు పదేళ్ల తర్వాత కీలక పదవి.. ఇదీ దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీలో తాజాగా దక్కిన గుర్తింపు. అంతకుముందే పదేళ్లు కేంద్ర మంత్రిగా ఐదేళ్లు పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిగా వ్యవహరించిన పురందేశ్వరికి గుర్తింపు దక్కడం ఆలస్యమైందనేది రాజకీయ వర్గాల వాదన. అయితే, ఎట్టకేలకు బీజేపీ అధిష్ఠానం ఆమెను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రకటించింది.

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి, నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు కుమార్తె అయిన పురందేశ్వరి.. ప్రకాశం జిల్లాలో పేరున్న కుటుంబమైన దగ్గుబాటి వారి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆమె భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉమ్మడి ఏపీలోనే 30 ఏళ్ల కిందటే కీలక పాత్ర పోషించారు.

టీడీపీ వ్యవస్థాపన సమయంలోనే కాక పుష్కర కాలంపాటు వెంకటేశ్వరరావు మామ ఎన్టీఆర్ కు కుడిభుజంగా నిలిచారు. అయితే, పార్టీ రెండుగా చీలిపోయిన సందర్భంలో నారా చంద్రబాబు పక్షం వహించినా కొన్ని నెలలకే  నిర్ణయం మార్చుకుని తిరిగి ఎన్టీఆర్ వద్దకు వెళ్లిపోయారు. కాగా, వెంకటేశ్వరరావు 2004కు ముందు బీజేపీలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.

భర్త అడుగుజాడల్లో నడిచి కాంగ్రెస్ లో చేరిన పురందేశ్వరి 2004 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించి కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. యూపీఏ తొలి టర్మ్ అంతా అదే హోదాలో ఉన్న ఆమె 2009 తర్వాత నేరుగా మానవ వనరుల శాఖ మంత్రిగా పదోన్నతి పొందారు. 2014 లో ఉమ్మడి ఏపీని విభజించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.

బీజేపీ నుంచి రాజంపేటలో 2014 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన పురందేశ్వరి ఆ పార్టీ తరపున కడప జిల్లా రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2004లో బాపట్ల, 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించినా.. మూడో సారి రాజంపేటలో బీజేపీ తరఫున గెలుపును అందుకోలేకపోయారు.

దాదాపు పదేళ్లకు..? కుటుంబ పరంగా, వ్యక్తిగతంగానూ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ప్రత్యేకత ఉన్న పురందేశ్వరికి బీజేపీలో చేరాక.. అందులోనూ ఆ పార్టీ అధికారంలో ఉండి కూడా తగిన ప్రాధాన్యం దక్కలేదనే విమర్శ ఉంది. అంతేగాక నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనూ ఆమె సేవలు వినియోగించుకోలేదనేది రాజకీయ వర్గాల అభిప్రాయం.

అయితే, మహిళా మోర్చా ప్రధాన ప్రభారితో పాటు ఒడిశా రాష్ట్ర బాధ్యతలను పురందేశ్వరికి అప్పగించారు. సొంత రాష్ట్రంలో, కేంద్రంలో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆమెకు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా కీలక పదవి దక్కింది.

Similar News