60మంది పోలీసుల రక్షణతో దళిత యువతి పెళ్లి ఊరేగింపు

Update: 2022-11-28 06:35 GMT
స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఏళ్లు అయినా దేశంలో దళితులు ఇంకా అణగారిపోతూనే ఉన్నారు. అగ్రవర్ణాల బెదిరింపులకు వేడుకలకు దూరంగా ఉంటూనే ఉన్నారు. దక్షిణాదిలో ఈ ఒరవడి తగ్గినా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రంలో ఇంకా ఈ పాడు భయాలు వెంటాడుతున్నాయి. అక్కడ దళిత యువతుల పెళ్లిళ్లు జరిగితే గ్రామాల్లో ఊరేగింపులు చేయనివ్వరు. ఉత్తరప్రదేశ్ లోని పలు గ్రామాల్లో ఈ కట్టుబాట్లు ఇంకా రాజ్యమేలుతున్న పరిస్థితి నెలకొంది.

ఉత్తరప్రదేశ్ లోని సంభాల్‌ జిల్లా లోహామయ్ గ్రామంలో ఓ దళిత యువతి పెళ్లి ఊరేగింపును 60 మంది పోలీసుల మధ్య నిర్వహించారు.  గుర్రపు స్వారీ మధ్య వరుడు రామ్ కిషన్ నేతృత్వంలోని దళితుల వివాహ ఊరేగింపును పోలీసులు తీసుకెళ్లారు. గున్నౌర్ ప్రాంతంలోని లోహమై గ్రామంలో దళితుల పెళ్లి ఊరేగింపులపై కొందరు అగ్రవర్ణ పురుషులు విధించిన 'ఆంక్షల'కు ప్రతిస్పందనగా యూపీ పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

వధువు రవీనా తన వరుడు గుర్రపు స్వారీని చూడాలని కోరికను వ్యక్తం చేసింది. పెళ్లి ఊరేగింపు కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకోగా ఎస్పీ నుంచి అనుమతులు లభించాయి. భారీగా పోలీసులు రక్షణగా వచ్చి మరీ ఈ ఊరేగింపు చేపట్టారు. వధువు -వరుడు ఊరేగింపుగా వెళుతుండగా, వేడుకలో డీజే సంగీతాన్ని ప్లే చేశారు.

వధువు కుటుంబీకుల అభ్యర్థన మేరకు, శుక్రవారం రాత్రి ఈ వేడుకను నిర్వహించేందుకు పోలీసు సూపరింటెండెంట్ (సంభాల్) చక్రేష్ మిశ్రా ప్రక్కనే ఉన్న పోలీసు స్టేషన్‌ల నుండి 60మంది పోలీసులను పంపారు.  

వేడుకలు పూర్తయ్యే వరకు సర్కిల్ ఆఫీసర్ (గున్నౌర్) అలోక్ కుమార్ సిద్ధు, పోలీసులు ఊరేగింపుతో ఉన్నారు. 44 మంది కానిస్టేబుళ్లు, 14 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఒక ఇన్‌స్పెక్టర్, సర్కిల్ ఆఫీసర్ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నారు.

ఇలా పోలీసుల భద్రత నడుమ ఆ దళిత కుటుంబం ఈ ఊరేగింపు వేడుకను ఘనంగా నిర్వహించింది. దీనిపై పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రాజు చౌహాన్, ఊర్మిల బాల్మీకి హర్షం వ్యక్తం చేశారు. దళితులకు దక్కిన గౌరవంగా దీన్ని అభివర్ణించారు. ఆ పోలీసు ఆ జంటకు రూ.11,000 "పెళ్లి బహుమతి" ఇచ్చాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News