డేంజర్.. అలర్ట్.. దేశంలో ఇన్ ఫ్లూయోంజా మరణాలు.. ఒకటి పొరుగునే

Update: 2023-03-10 14:50 GMT
అనుకున్నంతా అవుతోంది.. ఆ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. ఫ్లూ మహమ్మారి జడలు విప్పుతోంది. ఇప్పటివరకు కేసులే అధికంగా వస్తున్నాయి అనుకుంటే.. ప్రస్తుతం మరణాలూ నమోదయ్యాయి. అది కూడా మన పొరుగునే కావడం గమనార్హం. దేశంలో రెండు నెలలుగా ఇన్ ఫ్లూయోంజా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై గత వారం ఐసీఎంఆర్, ఐఎంఏ హెచ్చరికలు, జాగ్రత్తలు చెప్పాయి. మరోవైపు ఢిల్లీ ఎయిమ్స్ మాజీ చీఫ్ రణదీప్ గులేరియా కూడా ఫ్లూ వ్యాప్తి తీవ్రతను వివరించారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని కత్తెర తయారీ పరిశ్రమల నగరం కాన్పూర్ లో ఒక్క రోజులోనే 50 మంది రోగులు ఇన్ ఫ్లూయోంజాతో ఆస్ప్రత్రుల్లో చేరడం చర్చనీయాంశమైంది.

హైదరాబాద్ లోనూ వ్యాప్తి లక్షణాలను బట్టి చూస్తుంటే ఇన్ ఫ్లూయోంజా వైరస్ "హెచ్3ఎన్2" హైదరాబాద్ లోనూ వ్యాప్తిలో ఉంది. వైద్యుల వద్దకు రోజుకు 50 నుంచి వంద కేసులు వస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్ప్రతికి గత వారంలో 600 కేసులు వచ్చాయి. వీరంతా జ్వర, శ్వాసకోశ సమస్యల పీడితులు కావడం గమనార్హం. మరోవైపు ఫ్లూతో దేశంలో మరణాలు నమోదయా్యయి. కర్ణాటక, హరియాణాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో మరణ కారకాన్ని హెచ్3ఎన్2గా నిర్ధారించారు. హరియాణా ప్రభుత్వం మరణాన్ని ధ్రువీకరించనప్పటికీ.. కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం వెల్లడించాయి.

కరోనా పోయిందనుకుంటే..

కరోనా మహమ్మారి పోయిందని భావిస్తున్న సమయంలో ఇన్ ఫ్లూయోంజా పంజా కలకలం రేపుతోంది. రెండు, మూడు నెలలుగా ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని వెనుక 'ఇన్‌ఫ్లుయెంజా ఏ (Influenza A)' ఉప రకమైన 'హెచ్‌3ఎన్‌2 (H3N2)' ఉందని గత వారం వరకు తెలియ లేదు. కాగా, కర్ణాటకలో చోటుచేసుకున్న మరణాన్ని అధికారులు ధ్రువీకరించారు. హసన్‌ జిల్లాకు చెందిన 82 ఏళ్ల హీరే గౌడ హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా మార్చి 1న చనిపోయాడని చెప్పారు. హీరే గౌడ ఫిబ్రవరి 24న ఆసుపత్రిలో చేరాడు. ఆయన శాంపిల్‌ను పరీక్ష చేయగా.. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ నిర్ధారణ అయింది. హీరే గౌడ దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్‌ బాధితుడు.

దేశంలో వంద కేసులు.. హెచ్1ఎన్1 కూడా కొవిడ్‌ తరహా లక్షణాలతో పాటు వ్యాప్తి తీరు ఉన్న  ఇన్‌ ఫ్లు యెంజా కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి. ఆసుపత్రిలో చేరికలకూ ఇది కారణమవుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90కి పైగా హెచ్‌3ఎన్‌2 కేసులు నమోదయ్యాయి. మరో డేంజర్ ఏమిటంటే ఇన్‌ఫ్లుయెంజా మరో రకమైన హెచ్‌1ఎన్‌1 కేసులు కూడా నమోదయ్యాయి. ఈ హెచ్1ఎన్1 అంటే మరేంటో కాదు.. "స్వైన్ ఫ్లూ." కాగా, హెచ్3ఎన్2 లక్షణాలు జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి, అలసట. దీని కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతున్నప్పటికీ.. దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు ఉంటోంది. ఆసుపత్రిలో చేరికలు తక్కువగానే ఉంటున్నప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News