యువ మంత్రికి డేంజర్ బెల్స్....?

Update: 2023-03-01 09:23 GMT
విశాఖ జిల్లాకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ కి వచ్చే ఎన్నికలు అగ్ని పరీక్షంగా మారనున్నాయా అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో ఈసారి గెలవడం కష్టమే అని అంటున్నారు. రీసెంట్ గా వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక వెబ్ పోర్టల్ వారు చేసినట్లుగా చెబుతున్న సర్వేలో సైతం ఈ సీటులో వైసీపీకి వ్యతిరేకత ఎక్కువగా ఉందని అంటున్నారు.

ఇక మామూలుగా చూసినా అనకాపల్లి వైసీపీ పరిస్థితి ఏమీ బాగా లేదు అనే అంటున్నారు. మూడు గ్రూపులుగా వర్ధిల్లుతోంది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వరసగా నాలుగు సార్లు గెలిచి మంత్రి అయిన ప్రాంతం అది. పైగా గవరల స్థావరంగా ఉంది. అక్కడ గడచిన ఎన్నికలకు తీసుకుంటే ఒకసారి గెలిచిన వారు మళ్లీ గెలవడం లేదు.

అలా లెక్క చూస్తే 2004లో కొణతాల రామక్రిష్ణ కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆయన 2009లో ఓడారు. 2009లో ప్రజారాజ్యం తరఫున గంటా శ్రీనివాసరావు గెలిచారు. ఆయన మళ్లీ పోటీ చేయలేదు. 2014లో టీడీపీ తరఫున పీలా గోవింద్ గెలిచారు 2019లో ఆయన ఓడారు. 2019లో వైసీపీ నుంచి గుడివాడ అమరనాధ్ గెలిచారు. 2024లోనూ మళ్ళీ అక్కడ నుంచే పోటీ అంటున్న గుడివాడకు గత రెండు దశాబ్దాలుగా వన్ టైం విన్నింగ్ యాంటి సెంటిమెంట్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా అన్నది కూడా చర్చకు వస్తోంది

అదే విధంగా గతసారి సహకరించిన వైసీపీ నేతలు, గవర సామాజిక వర్గాలు ఈసారి మంత్రికి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా లేవని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే మరోసారి అనకాపల్లి నుంచి పోటీ చేస్తాను అని మంత్రి చెప్పినప్పటికీ దాడి వీరభద్రరావు ఇంకా ఆశలు పెట్టుకుని ఉన్నారని అంటున్నారు. ఆయన జగన్ నోట ఆ మాట వినాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఇక మంత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చినా జిల్లా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి  మాత్రం అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. పనితీరుని చూసే అధినాయకత్వం టికెట్ ఇస్తుందని చెబుతున్నారు. అలా ఆశవహులలో ఆశలను సజీవంగా ఉంచుతున్నారు. దానికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు ముంగిట్లో ఉండడమే. అదే విధంగా అధినాయకత్వం సైతం ఎప్పటికపుడు సర్వే నివేదికలు తెచ్చి సరిచూసుకుంటోంది.

యువ మంత్రికి  రాజకీయంగా ఇబ్బంది అంటే అనకాపల్లి సీటుని ఆయనకు ఇచ్చే అవకాశాలు కూడా ఉండవని అంటున్నారు. అదే సమయంలో ఆల్టర్నేటివ్ గా ఆయనకు అనకాపల్లి ఎంపీ సీటు ని ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. 2014లో గుడివాడ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఈసారి సరైన క్యాండిడేట్ లేకపోవడం వల్ల కూడా చివరి నిముషంలో మంత్రిని బరిలోకి దింపుతారు అని అంటున్నారు.

అయితే అనకాపల్లి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కూడా వైసీపీకి టఫ్ జాబ్ గానే ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే లోకల్ కార్డుతో యువ మంత్రికి చెక్ చెప్పాలని స్వపక్షంలో విపక్షం చూస్తూంటే టీడీపీ జనసేన ఇక్కడ బాగా బలం పుంజుకోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది అనే అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News