ఉన్న ఉద్యోగాలు ఊడిపాయే .. కొత్తవి రాకపాయే!

Update: 2020-09-10 07:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అన్ని రంగాలను కుదిపేసింది.  కరోనా దెబ్బకు అనేక కంపెనీలు ఉద్యోగులను నిర్ధాక్ష్యణ్యంగా తీసిపారేశాయి. ఇప్పట్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకొనే అవకాశం కూడా లేదు. కొన్ని కంపెనీల అయితే సెలవుల పేరిట ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. దీంతో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వేతన జీవులు రోడ్డున పడ్డారు. అయితే తాజాగా మ్యాన్​పవర్​ గ్రూప్​ సంస్థ కంపెనీల్లో ఉద్యోగుల పరిస్థితిపై ఓ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో పలు షాకింగ్​ నిజాలు వెలుగుచూశాయి.  రానున్న మూడునెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీ కూడా కొత్తగా ఉద్యోగులను నియమించుకోవాలనకోవడం లేదట. ఈ సర్వే సంస్థ మనదేశంలోని దాదాపు 813 కంపెనీలను సర్వేచేసింది. ఆ కంపెనీ యజమానులు చెప్పిన వివరాల ఆధారంగా ఓ సమగ్ర రిపోర్ట్​ను తయారు చేసింది. ఈ సర్వే చూస్తే రానున్న రోజుల్లో ఉద్యోగుల పరిస్థితి అత్యంత భయానకంగా ఉండబోతున్నదని స్పష్టం అవుతున్నది.

దేశంలో నిరుద్యోగం మరింత పెచ్చరిల్లే పరిస్థతి కనిపిస్తోంది.  దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో కేవలం 3 శాతం కంపెనీలు మాత్రమే కొద్దిమేర నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నదని సర్వే తేల్చింది.  తాము డిసెంబర్​ వరకు ఒక్క ఉద్యోగిని కూడా కొత్తగా నియమించుకోబోమని.. ఉన్నవాళ్లకు కూడా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు  ఇవ్వబోమని దేశంలోని 54 శాతం కంపెనీలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాయట. ఉద్యోగుల సంఖ్య కొంతమేర పెంచుకుంటామని కేవలం 7 శాతం కంపెనీలు తేల్చిచెప్పినట్టు సర్వే రిపోర్ట్​ స్పష్టం చేస్తోంది. గత 15 ఏళ్లుగా ఈ సర్వే సంస్థ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగుల పరిస్థితిపై సర్వేలు నిర్వహిస్తోంది. అయితే ఈ సారి ఉన్నంత గడ్డుకాలం ఎప్పుడూ లేదని సర్వేసంస్థ పేర్కొంది.  పెద్దపెద్ద కంపెనీల కంటే.. చిన్నకంపెనీలే ఉద్యోగుల పట్ల కాస్త దయతో ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.

కొత్త ఉద్యోగాలు ఎప్పుడు..
మరో 9 నెలల పాటు నిరుద్యోగులకు వెతలు తప్పవు. ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడితే కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. అందులోనూ ఓ తిరకాసు ఉన్నది. ఇప్పటికే పలు కంపెనీలు ఎక్కువ జీతాలు ఇవ్వవలిసి వస్తున్నదని  సీనియర్లను వదిలించుకున్నాయి. వారిని తిరిగి నియమించుకోకపోవచ్చనని పలు కంపెనీలు చెప్పాయట. కొత్తగా ట్రైనీలకు, యువకులకు మాత్రమే అవకాశాలు ఉన్నాయట. ఏది ఏమైనా ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు గడ్డురోజులే కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News