బళ్లారిలో బయటకు వస్తే అలా చేసి జైలుకు పంపుతున్నారు

Update: 2021-05-19 04:30 GMT
కరోనా కేసులు ఎంతకు తగ్గని పరిస్థితుల్లో.. ఆఖరి అస్త్రమైన లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమకు తగిన రీతిలో.. జన జీవనం పూర్తిగాస్తంభించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ లాక్ డౌన్ విధిస్తున్నారు. అయినప్పటికి కొన్ని రాష్ట్రాల్లోని ప్రజల్లో ఇప్పటికి మార్పు రాని పరిస్థితి నెలకొంది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి.

ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. వైరస్ కట్టడి కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నా.. ఫలితం ఉండని పరిస్థితి. ఈ నేపథ్యంలో బళ్లారి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఐదు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మాదిరి.. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వటం.. ఆ తర్వాత నుంచి అన్నింటిని మూసి వేసేలా నిర్ణయం తీసుకున్నారు.

అత్యవసర సేవలు మినహా.. మిగిలిన అన్ని షాపులు మూసివేయటమే కాదు.. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారి విషయంలో అక్కడి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎంతో అవసరం ఉంటే తప్పించి బయటకు రాకూడదని తేల్చి చెబుతున్నారు. ఇంత తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా.. కొందరు మాత్రం బయటకు రావటంపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

లాక్ డౌన్ వేళలో అవసరం లేకున్నా బయటకు వస్తే.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని సీజ్ చేయటమే కాదు.. వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. ఇప్పటివరకు అలా 600 వాహనాల్ని సీజ్ చేయటంతో పాటు.. జైలుకు పంపారు. వైరస్ విరుచుకుపడుతున్న వేళ ఆ మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిందే. అప్పుడైనా మిగిలిన వారికి అంతో ఇంతో జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది.
Tags:    

Similar News