వివాదాస్పద నిత్యానంద స్వామి మరణించారనే వార్తల్లో నిజమెంత?

Update: 2022-05-22 11:30 GMT
ప్రముఖ సినీ నటి రంజితతో రాస లీలలు చేస్తూ గతంలో వీడియో సాకిగా అడ్డంగా దొరికిపోయారు.. నిత్యానంద స్వామి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తే వీడియోను తీసి వైరల్‌ చేశాడు. కాగా, తన క్రియో యోగా పద్దతి ద్వారా దేశ విదేశాల్లో ఎంతోమంది భక్తులను సంపాదించుకున్నారు.. నిత్యానంద. కర్ణాటకలో బెంగళూరు సమీపంలోని బిడాడిలో ఉన్న ఆయన ఆశ్రయం నిత్యం కొన్ని వేల మంది భక్తులతో కళకళలాడుతుండేది. కోట్ల రూపాయల్లో విరాళాలు, అడుగులకు మడుగులొత్తే శిష్యులు, దేశవిదేశాల్లో పేరు ప్రతిష్టలు నిత్యానంద సొంతం. అలాంటి నిత్యానంద హీరోయిన్‌ రంజితతో రాసలీలల్లో మునిగితేలుతూ అడ్డంగా దొరికిపోయాక క్రమంగా తన పేరు ప్రతిష్టలన్నీ పొగొట్టుకున్నాడు.

తర్వాత జైలు పాలయిన నిత్యానంద 2019లో దేశాన్ని వదిలేసి పారిపోయాడు. లాటిన్‌ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి ప్రత్యేకంగా దానికి కైలాస దేశం అని నామకరణం చేశాడు. ఆ దేశాన్ని గుర్తించాలని ఏకంగా ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి పెట్టుకున్నాడు. కైలాస దేశం పేరిట వీసాల జారీని కూడా చేపట్టాడు. కైలాస్‌ డాలర్‌ పేరుతో కరెన్సీని ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చాలవన్నట్టు కైలాస దేశానికి తనను తాను ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నాడు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కైలాసను కూడా ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు.

ప్రస్తుతం కైలాస దేశంలోనే ఉంటున్న నిత్యానంద స్వామి ఎప్పటికప్పుడు తన దేశానికి చెందిన తాజా వార్తలను సోషల్‌ మీడియాలో వెల్లడిస్తున్నాడు. అలాగే తనకు చెందిన వార్తలను కూడా దేశ విదేశాల్లో ఉన్న తన భక్తులతో పంచుకుంటున్నాడు. ఇందుకోసం నిత్యానంద స్వామి ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ కూడా పెట్టడం గమనార్హం.

ఇలా తన వ్యవహార శైలితో దేశంలో ఎంతో పాపులరైన నిత్యానంద స్వామి మరణించారనే వార్తలు ఆయన భక్తులను దిగ్భ్రమకు గురి చేశాయి. ఆయన అవసాన దశలో ఉన్నారని.. కాదు.. చనిపోయారంటూ వార్తలు వ్యాపించాయి. దీనిపై నిత్యానంద స్వామి స్పష్టత ఇచ్చారు. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియా సాక్షిగా వివరాలను వెల్లడించారు. తాను మరణించలేదని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు. 27 మందితో కూడిన ప్రత్యేక వైద్యుల బృందం ప్రస్తుతం తనకు చికిత్స అందజేస్తోందని నిత్యానంద సోషల్‌ మీడియా సాక్షిగా భక్తులకు వివరించారు. కాబట్టి తన ఆరోగ్యంపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. దీంతో ఆయన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

తాను ప్రస్తుతం సమాధి స్థితిలో ఉన్నానని.. మనుషులను గుర్తు పట్టలేకపోతున్నానని నిత్యానంద స్వామి తెలిపారు. డాక్టర్లు అందిస్తున్న చికిత్సతో తాను నెమ్మదిగా కోలుకుంటున్నానని.. కాబట్టి ఎవరూ కంగారు పడొద్దని నిత్యానంద కోరారు.
Tags:    

Similar News