అప్పులు చేయరు కానీ భూములు అమ్మేస్తారట.. కేసీఆర్ కొత్త ప్లానింగ్

Update: 2021-02-15 07:30 GMT
అప్పు చేయటం అలవాటుగా మారితే.. ఎలాంటి పరిస్థితి ఉంటుందన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు సాధించిన డెవలప్ మెంట్ ఏమిటన్నది అందరికి తెలిసిందే. కానీ.. అరవైఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పు కంటే కూడా.. గడిచిన ఏడేళ్లలో రెండు రాష్ట్రాలు చేసిన అప్పే అత్యధికమని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర అప్పు రూ.1.5లక్షల కోట్లకు కాస్త అటూ ఇటూగా ఉండేది. ఇప్పుడు ఒక్కోరాష్ట్రం చేసి అప్పే దగ్గర దగ్గర రూ.3లక్షల కోట్లకు పైనే ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు.

అప్పు మీద ఎప్పుడూ ఫోకస్ చేయని కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన ఆలోచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అప్పుల భారం ఖజానాకు గుదిబండగా మారుతున్న వేళ.. అప్పులు చేసే అలవాటును తగ్గించుకోవాలన్నట్లుగా ఆయన తాజా ఆలోచనలు ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి క్రమంగా రుణ ప్రతిపాదనలు తగ్గించాలని.. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాన్ని పెంచుకునే దిశగా కసరత్తు చేపట్టాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

రానున్న రెండేళ్ల పాటు ఊహాజనిత అంచనాలకు పోకుండా.. వాస్తవిక బడ్జెట్ అంచనాలకు పరిమితం కావాలని.. కచ్ఛితమైన బడ్జెట్ ను రూపొందించాలన్న మాటను చెప్పినట్లు చెబుతున్నారు. దీంతో.. గతంతో పోలిస్తే బడ్జెట్ అంచనాలు తగ్గటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. అప్పులు చేయకుండా ఆదాయం ఎలా? అంటే.. పాత కాన్సెప్టును... కొత్తగా బయటకు తీసింది కేసీఆర్ సర్కారు.

రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న భూముల అమ్మకాలు.. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి అమల్లోకి రాని భూముల మార్కెట్ విలువల సవరణ.. మైనింగ్ వేలం లాంటి ప్రతిపాదనలతోపాటు.. రాష్ట్రంలోని కార్పొరేషన్లకు స్వీయ రాబడులు పెంచే మార్గాలు.. ఎక్సైజ్ ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశలో ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. ఆదాయాన్ని శాశ్వితంగా పెంచేలా బడ్జెట్ అంచనాలు ఉంటాయని చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో కనీసం రూ15వేల కోట్లను భూముల వేలం ద్వారా సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు.

అప్పులు తేకుండా మేనేజ్ చేయటం బాగానే ఉన్నా.. అందుకు విలువైన భూముల్ని అమ్మకానికి పెట్టటం ద్వారా ప్రత్యేకంగా ఒరిగేదేమిటి? అన్నది ప్రశ్న. దీనికంటే కూడా.. బకాయిల వసూళ్లు.. అనవసర ఖర్చులు.. నిరర్థక ఆస్తుల అమ్మకాల మీద ఫోకస్ పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూములు రాష్ట్ర ప్రభుత్వానికి విలువైన ఆస్తులన్న విషయాన్ని గుర్తించాలి. గడిచిన ఇరవైఏళ్లలో భూముల విలువ ఎంతలా పెరుగుతుందో చూస్తున్నదే. అలాంటిది రానున్న రోజుల్లో భూముల విలువ మరింత పెరగటం ఖాయం. మరి.. ఈ విషయాన్ని కేసీఆర్ సర్కారు ఎందుకు గుర్తించటం లేదన్నది ప్రశ్న.
Tags:    

Similar News