వేద నిల‌యంపై అన్నా..చెల్లెలు మాట ఒకటే

Update: 2017-06-18 07:10 GMT
అంద‌రిని వ‌దిలేసి అమ్మ‌.. త‌న దారిన తాను వెళ్లిపోయినా.. ఆమెకు సంబంధించిన ఇష్యూలో ఇప్ప‌టికిప్పుడు ఒక కొలిక్కి వ‌చ్చేట‌ట్లుగా క‌నిపించ‌టం లేదు. త‌న జీవిత‌కాలంలో అమ్మ వెన‌కేసిన ఆస్తులు ఇప్పుడెంత ర‌చ్చ చేస్తున్నాయో తెలిసిందే. అమ్మ ఉన్న‌ప్పుడు ఒక వెలుగు వెలిగిపోయిన పోయెస్ గార్డెన్ లోని వేద నిల‌యం ఇప్పుడు క‌ళా విహీనంగా మారింది. అంతేనా.. అమ్మకు చెందిన ఈ ఇంటిని సొంతం చేసుకునేందుకు ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అమ్మ మ‌ర‌ణించిన త‌ర్వాత వేద నిల‌యంలో శ‌శిక‌ళ ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

అక్ర‌మాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లిన నేప‌థ్యంలో.. ఆ ఇంటిని త‌మ‌దంటే త‌మ‌ద‌న్న మాట‌లు మంట‌లు రేపుతున్నాయి. మ‌రోవైపు.. అమ్మ ఇంటిని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాల‌ని మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం కొంత‌కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఇంటి విష‌యంపై జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు.. మేన‌ల్లుడు ఇద్ద‌రూ ఇప్పుడు ఒకే మాట‌ను వినిపిస్తున్నారు. రాజ‌కీయంగానూ.. వ్య‌క్తిగ‌తంగానూ ఈ అన్నాచెల్లెళ్ల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌న్న విష‌యం తెలిసిందే. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు జ‌య‌ల‌లిత మేన‌ల్లుడు దీప‌క్‌ - పోయెస్ గార్డెన్ లోని వేద‌నిల‌యం త‌న అత్త‌పేరు మీద ఉంద‌న్నారు.

ఈ ఆస్తిని త‌మ నాన‌మ్మ (జ‌య‌ల‌లిత త‌ల్లి సంధ్య‌).. మేన‌త్త‌లు క‌లిసి కొన్నార‌న్నారు. నాట్య‌క‌ళానికేత‌న్ సంఘంలో తమ నాన‌మ్మ‌.. మేన‌త్తు ఇద్ద‌రు స‌భ్యుల‌ని.. ఆ సంఘం పేరుతోనే ఇంటిని కొనుగోలు చేశారంటూ కొత్త పాయింట్‌ ను తెర మీద‌కు తెచ్చారు. 1971 న‌వంబ‌రు ఒక‌టిన నాట్య‌క‌ళానికేత‌న్ పేరిట ఉన్న ఆస్తుల‌ను అత్త పేరిట నాన‌మ్మ మార్చిన విష‌యాన్ని వెల్ల‌డించారు.

అందుకు సంబంధించిన దస్తావేజులు త‌న ద‌గ్గ‌రే ఉన్నాయ‌న్నారు. చ‌ట్ట‌ప్రకారం వేద‌నిల‌యం త‌న‌కు.. త‌న సోద‌రి దీప‌కు మాత్ర‌మే హ‌క్కు ఉంద‌ని.. త‌మ ఇద్ద‌రికే ఆ ఇల్లు సొంత‌మ‌న్నారు. వేద‌నిల‌యంలో ఉన్న శ‌శిక‌ళ కుటుంబ స‌భ్యులు.. బంధువులు త‌మ వ‌స్తువుల్ని తీసుకొని వెళ్లిపోవాల‌ని దీప‌క్ డిమాండ్ చేస్తున్నారు. వేద‌నిల‌యం మాత్ర‌మే కాదు.. మేన‌త్త మిగిలిన ఆస్తులు కూడా త‌మ‌కే చెందుతాయ‌ని అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

మ‌రోవైపు ఇదే విష‌యంపై దీప స్పందిస్తూ.. వేద‌నిల‌యంలో ఏదో జ‌రుగుతుంద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. వేద నిల‌యంలో ఏదో జ‌రుగుతోంద‌న్న అంశంపై ద‌ర్యాఫ్తు క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధాని మోడీని కోర‌నున్న‌ట్లుగా అమ్మ మేన‌కోడులు దీప  వెల్ల‌డించారు. రాజ‌కీయంగా ఈ అన్నాచెల్లెళ్ల‌వి వేర్వేరు దారులుగా క‌నిపిస్తున్నా.. ఆస్తుల విష‌యంలో మాత్రం ఇద్ద‌రి మాట ఒక్క‌టిగానే ఉండ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News