వారే బ‌రిలో దిగితే.. ఓట‌మి ఖాయం.. వైసీపీ గేరు మారుస్తోందా?

Update: 2023-07-07 20:06 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీ గేరు మారుస్తోందా?  ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది.. ఒక ఎత్త‌యితే.. ఇక ఎన్నిక‌ల వేడి పెరిగిన నేప‌థ్యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల‌ని భావిస్తోందా?  అంటే.. తాజాగా మారుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు ఔన‌నే అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐప్యాక్‌.. ఇత‌ర‌త్రా సంస్థ‌లు అందించిన నివేదిక‌ల ఆధారంగా  15 నుంచి 20 మంది ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని వైసీపీ అధిష్టానం నిర్ణ‌యించిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. ఇప్పుడు మ‌రింత మందిని ప‌క్క‌న పెట్టాల‌నే వ్యూహాన్ని వైసీపీ తెర‌మీదికి తెచ్చింద‌ని భావిస్తు న్నారు.  టీడీపీ నుంచి పోటీ చేసి.. వ‌రుస ప‌రాజ‌యాలు పొందుతున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచిన వైసీపీ నేత‌ల‌ను కూడా కూడా ప‌క్క‌న పెట్టాల‌ని  తాజాగా నిర్ణ‌యించిన‌ట్టు చెబుతున్నారు.

అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. ఎమ్మెల్యేల‌పై  వ్య‌తిరేక‌త ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు.. టీడీపీకి సింప‌తీ పెరిగిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. మార్పులు చేయాల‌ని వైసీపీ నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

ఉదాహ‌ర‌ణ‌కు.. కురుపాం, పాల‌కొండ‌, నెల్లూరు సిటీ స‌హా దాదాపు 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కులు వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్నారు. దీంతో స‌హ‌జంగానేవారిపై కొంత వ్య‌తిరేక‌త ఉంది.

దీనికి తోడు..ఇదే స్థానాల్లో వ‌రుస ఓట‌ములు చ‌విచూసిన‌.. టీడీపీ నేత‌ల‌కు.. సింప‌తీ పెరిగింది. వీరంతా కూడా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతూ.. "ఇప్ప‌టికి రెండు సార్లు వైసీపీ నేత‌ల‌ను గెలిపించారు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ మాకివ్వండి" అంటూ.. ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు.

దీంతో ప్ర‌జ‌ల్లో టీడీపీ ఓట‌మి నేత‌ల‌పై సింప‌తీ పెరిగింది. ఈ క్ర‌మంలో వారికి ఒక్క ఛాన్స్ ఇచ్చే దిశ‌గా ఆ యా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిణామాలు మారుతున్నాయ‌ని గ్ర‌హించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు వారికే టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేస్తున్నారు.

పాల‌కొండలో నిమ్మ‌క జ‌య‌కృష్ణ‌, కురుపాంలో జ‌గ‌దీశ్వ‌రి, నెల్లూరు సిటీలో పొంగూరు నారాయ‌ణ వంటివారికి టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేశారు. వీరంతా విజ‌యం ద‌క్కించుకుంటార‌ని చంద్ర‌బాబు కూడా విశ్వ‌సిస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వైసీపీ రెండు సార్లు వ‌రుస‌గా విజ‌యం ద‌క్కించుకుని.. ప్ర‌జ‌ల్లో సానుభూతి కొర‌వ‌డిన నాయ‌కుల‌ను కూడా త‌ప్పించా ల‌ని.. టీడీపీకి  ఛాన్స్ ఇవ్వ‌కుండా.. వ్యూహం వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఫ‌లితంగా 20 నియోజ‌క‌వ‌ర్గాల్లోకొత్త వారికి లేదా.. తొలిసారి పోటీ చేసేవారికి అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Similar News