ఎమ్మెల్యేగా ఓడినోళ్ల టైమ్ నడుస్తోంది!

Update: 2019-06-14 01:30 GMT
తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలప్పుడు ఓటమి పాలై - కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు అని విమర్శల పాలైన నేతలకు ఇప్పుడు కాలం కలిసి వచ్చినట్టుగా అగుపిస్తోంది. ఒకరు కాదు - ఇద్దరు కాదు.. ఎమ్మెల్యేలుగా  ఓడిన పలువురు  నేతలకు అవకాశాలు కలిసి వస్తూ ఉన్నాయి.

అలాంటి జాక్ పాట్ కొట్టిన వారిలో కిషన్ రెడ్డి ముందున్నారు. అంబర్ పేట్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిన ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా నెగ్గి కేంద్రంలో మంత్రి అయ్యారు - హోం శాఖ సహాయ మంత్రిగా ఊపు మీదకు వచ్చారు.

ఆయన మాత్రమే కాదు.. తెలంగాణ లో ఎంపీలుగా నెగ్గిన ఎంపీల్లో ఎమ్మెల్యేలుగా ఓడిన మరి కొందరున్నారు. వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. వారు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున నెగ్గిన నామా నాగేశ్వరరావు పరిస్థితి కూడా అదే అని చెప్పనక్కర్లేదు.

ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ  తరఫున ఓడిన  నామా - ఆ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరి ఎంపీగా నెగ్గేశారు. అంతే కాదు.. ఇప్పుడు ఆయనకు ఏకంగా లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వ బాధ్యతలు దక్కాయి. ఎమ్మెల్యేగా ఓడి - ఎంపీగా నెగ్గడమే విచిత్రం అనుకుంటే - ఇలా ఏకంగా ఆయన లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి పక్ష నేతగా నిలుస్తూ ఉండటం మరో విచిత్రం! మొత్తానికి ఎమ్మెల్యేలుగా ఓడిన వారి టైమ్ ఇప్పుడు నడుస్తూ ఉన్నట్టుంది!
Tags:    

Similar News