ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో దొంగలు పడ్డారు

Update: 2023-04-20 08:00 GMT
ఐపీఎల్ లో భారీ దొంగతనం వెలుగుచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ లో దొంగలు పడ్డారు. ఈ సీజన్‌లోని మొత్తం ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయిన ఢిల్లీకి ఈ పరిణామం మరింత షాక్ కు గురిచేస్తోంది. కొంతమంది ఆటగాళ్లకు చెందిన ₹16 లక్షల విలువైన బ్యాట్‌లు, ప్యాడ్‌లు , ఇతర పరికరాలు రవాణా సమయంలో దొంగిలించబడ్డాయి.

బెంగళూరు నుండి ఢిల్లీకి వారి ప్రయాణంలో వస్తువులు కనిపించకుండా పోయాయి. వారి కిట్ బ్యాగ్‌లను గదుల్లో పెట్టిన తర్వాత మాయమయ్యాయి. దొంగిలించబడిన వాటిలో ఎక్కువగా బ్యాట్‌లు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ , ఫిల్ సాల్ట్ ఒక్కొక్కరు , మిచెల్ మార్ష్ రెండు బ్యాట్లు కోల్పోయారు. భారత యువ ఆటగాడు యష్ ధుల్ కు చెందిన ఐదు బ్యాట్లు తస్కరించారు. అంతేకాకుండా కొంతమంది క్రికెటర్లు వారి బూట్లు, గ్లౌజులు కూడా పోయాయని చెప్పారు.

అందరూ తమ కిట్ బ్యాగ్‌ల నుండి ఏదో ఒకటి పోగొట్టుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఐపీఎల్ లో దొంగలు పడ్డారన్న వార్త అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. విషయం లాజిస్టిక్స్ విభాగానికి, పోలీసులకు ,తరువాత విమానాశ్రయానికి చేరుకుందని దర్యాప్తు కొనసాగుతోంది అని పోలీసు అధికారులు తెలిపారు.

కొంతమంది విదేశీ ఆటగాళ్ల బ్యాట్‌ల ధర దాదాపు ₹1 లక్ష. వారి పరికరాలు ఖరీదు అయినవిగా గుర్తించారు. ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో వారి తదుపరి మ్యాచ్ ను హోమ్ గ్రౌండ్లో ఆడాల్సి ఉంటుంది.

ముందు వారి ప్రాక్టీస్ సెషన్‌ను ఇవే బ్యాట్లతో పూర్తి చేయాలి. మరి పోయిన బ్యాట్ ల స్థానంలో ఆటగాళ్లు ఎలాంటి ప్రత్యామ్మాయాలు వాడుతారాన్నది వేచిచూడాలి. ఆటగాళ్లు వెంటనే తమ మేనేజర్‌లతో తాజా బ్యాట్ లు పంపడానికి బ్యాట్ తయారీదారులను సంప్రదించారు.  

ఆటగాళ్ల వస్తువులు పెద్దమొత్తంలో మాయమవడం ఇదే తొలిసారి. ఐపీఎల్ లో ఆటగాళ్ల సమానును సాధారణంగా ఒక లాజిస్టిక్స్ కంపెనీ చూసుకుంటుంది. ఇది కిట్‌బ్యాగ్‌లను ఒక గమ్యస్థానం నుండి మరొక గమ్యస్థానానికి సాఫీగా బదిలీ చేయడానికి బాధ్యత వహిస్తుంది. కిట్‌బ్యాగ్‌లను ఆటగాళ్లు తమ గదుల వెలుపల ఉంచుతారు. వారు తదుపరి హోటల్‌కు చేరుకుంటారు.

ఈ చోరీ ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారు.  వరుసగా  5 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో ఉన్న ఢిల్లీకి ఈ చోరీ మరింతగా దెబ్బతీసిందని చెప్పొచ్చు.

Similar News