`వైఎస్సార్` పేరుపై వివాదం...వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Update: 2020-09-04 09:30 GMT
వైఎస్సార్ సీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ `అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ` దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును తాము రిజిస్టర్ చేయించుకున్నామని, వైఎస్సార్ పేరును వైసీపీ వాడకుండా చూడాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా, ఏపీ అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ వేసిన రిట్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీ, సీఈసీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబరు 4కు వాయిదా వేసింది. అయితే, ఈ వ్యవహారంలో గతంలో విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు....వైసీపీ, సీఈసీలకు నోటీసులు జారీ చేసింది. కానీ, ఆ నోటీసులపై వైసీపీ, సీఈసీలు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

వైఎస్సార్ అనే పదంతో చాలా ఏళ్ల క్రితం నమోదైన ఏకైక పార్టీ తనదేనని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని మహబూబ్ బాషా చెబుతున్నారు. వైకాపా అధికార పత్రాలపై యువజన శ్రామిక పార్టీ అని పూర్తి పేరు రాయడం లేదని, వైఎస్సార్ అని తమ పార్టీని ప్రతిబింబించేలా రాయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. అయితే, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో వైఎస్సార్ అని రాయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. తనకు పార్టీ ఇచ్చిన బీఫారమ్ లో పేరు వేరని, షోకాజ్ నోటీసులో పేరు వేరని రఘురామకృష్ణం రాజు పాయింట్ అవుట్ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. దీంతో, మొదట ఈ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేసిన మహబూబ్....ఆ తర్వాత ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రఘురామ కృష్ణం రాజు ఇచ్చిన హింట్ వల్లే ఈ వ్యవహారం తెరపైకి వచ్చిందని, లేకుంటే ఆ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News