ఆందోళనకరంగా 'డెల్టా వేరియంట్‌' !

Update: 2021-06-18 09:30 GMT
భారత్‌ లో మొట్టమొదటిసారిగా గుర్తించిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌ ను ఆందోళనకరమైన వేరియంట్‌ గా అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (యూఎస్‌ సీడీసీ) ప్రకటించింది. అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న బి.1.1.7.(ఆల్ఫా), బి.1.351(బీటా), పి.1(గామా), బి.1.427 (ఎప్సిలన్‌), బి.1.429(ఎప్సిలన్‌), బి.1.617.2 (డెల్టా) వేరియంట్లను ఆందోళనకరమైనవిగా గుర్తిస్తున్నాం. అయితే, అత్యంత ప్రభావం చూపే వేరియంట్లను అమెరికాలో ఇప్పటి వరకు గుర్తించలేదు అని సీడీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

జూన్‌ 5వ తేదీ నాటికి దేశంలో నమోదైన కోవిడ్‌ కేసుల్లో 9.9% డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. డెల్టా సంక్రమణ వేగం చాలా ఎక్కువనీ, ప్రస్తుతం ఉన్న చికిత్సా విధానాలు దీనిపై అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయని వివరించింది. డెల్టాను ఆందోళనకర వేరియంట్‌గా మే 10వ తేదీనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా, జూన్‌ 13వ తేదీ నాటికి అమెరికాలో నమోదైన కేసుల్లో 10.3% డెల్టా వేరియంట్‌వేనని ఔట్‌బ్రేక్‌ ఇన్ఫో అనే వెబ్‌సైట్‌ వెల్లడించింది. వచ్చే నెల రోజుల్లో అమెరికాలోని కోవిడ్‌ కేసుల్లో అత్యధిక భాగం డెల్టా వేరియంట్‌కు చెందినవే అవుతాయని సీఎన్‌ఎన్‌ ఒక కథనంలో హెచ్చరించింది.

భారత్‌ లో వెలుగుచూసిన బి.1.617 విభాగంలోని మూడు వేరియంట్లలో డెల్టా (బి.1.617.2) కూడా ఒకటి. బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన ఆల్ఫా రకానికన్నా ఇదే ఎక్కువగా వ్యాపిస్తోందని ఈ అధ్యయనం తేల్చింది. దేశ వ్యాప్తంగా దాదాపుగా 12వేలకు పైగా కరోనా వేరియంట్‌లు ఉంటే, వాటన్నింటిలోనూ డెల్టా వైరస్సే ప్రమాదకరమని కూడా ఈ అధ్యయనం పేర్కొంది. నిజానికి దేశంలో మిగిలిన వేరియంట్‌లు పెద్దగా ప్రభావాన్ని చూపలేదని, వాటన్నిటి స్థానాన్ని డెల్టా వేరియంట్‌ ఆక్రమించిందని తెలిపింది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తరువాత బ్రిటన్‌లో వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్‌ వ్యాప్తి దాదాపుగా ఆగిందని, డెల్టా విషయంలో మాత్రం ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు.
Tags:    

Similar News