79 ఏళ్ల వయసులో ఎలాన్ మస్క్ తండ్రి వీర్యం కోసం భారీ క్యూ!

Update: 2022-07-21 15:30 GMT
పాతికేళ్ల క్రితం ఇలాంటి మాటలు సభ్య సమాజంలో మాట్లాడటమా? అంటూ ఎగాదిగా చూడటమేకాదు.. ఇలాంటి వాటి గురించి మాట్లాడటం కూడా పాపమన్నట్లుగా ఉండేది మన దేశంలో. ఇటీవల కాలంలో వచ్చిన మార్పుల వల్ల.. చాలా విషయాల్ని ఓపెన్ గా మాట్లాడేసుకుంటున్న వరకు వచ్చాం. వీర్యదాతల గురించి ఇప్పటికి మన దేశంలో ఓపెన్ గా మాట్లాడేవారు.. వీర్యదాతలుగా ప్రొఫెషన్ ల్స్ ను ఛీ.. ఛీ అన్నట్లు చూడటం లాంటివి ఉంటాయి. అలాంటిది.. ప్రపంచ సంపన్నుల్లో తొలి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ తండ్రి.. తన వీర్యాన్ని దానంగా ఇస్తున్న వైనం.. దానికి సంబంధించి అతగాడు చెప్పుకునే మాటలు వింటే.. ముక్కున వేలేసుకోవాల్సిందే.

లక్షల కోట్ల సంపన్నుడైన ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదగటమే కాదు.. ఈ రోజున ప్రపంచంలో అపరకుబేరుడిగా మారాడు. అలాంటి వ్యక్తికి జన్మనిచ్చిన తండ్రి వీర్యం పవర్ మీద చాలామంది ఆశలు పెట్టుకోవటం విడ్డూరంగా అనిపించినా.. ఇది నిజం. 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన్ను.. వీర్యం కోసం అడిగే మహిళలు భారీగా ఉన్నట్లుగా ఎలాన్ మస్క్ తండ్రే స్వయంగా చెప్పుకొచ్చారు. చదివినంతనే జీర్ణించుకోవటానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికి ఇది నిజమని చెబుతున్నారు.

ఎలన్ తండ్రి పేరు ఎర్రోల్. ఆయనకు ఇప్పటికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్యకు సంబంధించిన వివరాలు తెలిసినోళ్లంతా నోరెళ్లబెట్టే పరిస్థితి. ఎందుకంటే.. మూడో భార్య ఎవరో కాదు.. రెండో భార్య హీడే బెజుడెన్ హౌట్ కుమార్తె. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ కావొచ్చు. రెండో భార్య కుమార్తెను ఎలా చేసుకుంటారని. ఇక్కడ లెక్కేమంటే.. రెండో భార్య మొదటి భర్తకు కలిగిన సంతానమే ఆయన మూడో భార్య.

ఏమైనా.. కూతురు వరస అయ్యే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఈ మనిషి అని సీరియస్ కావొచ్చు. దానికి ఆయన చెప్పే సమాధానం ఏమంటే.. ''భూమి మీద మనం ఉన్నది పిల్లల్ని పుట్టించటానికే'' అంటూ చేసిన వ్యాఖ్యలపై చాలామంది గుస్సా అయినా.. ఆయన మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఇక.. ఆయన వీర్యం కోసం చాలామంది మహిళలు క్యూ కడుతుంటారని గొప్పగా చెబుతాడు కూడా. తన ద్వారా మరింత మంది ఎలాన్ మస్క్ లు పుట్టేందుకు తాను సహకరిస్తున్నట్లుగా చెప్పుకుంటాడు.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వీర్యదానం గురించి మాట్లాడుతూ.. 'ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. మేధావి ఎలాన్ మస్క్ కు జన్మనిచ్చిన తండ్రిని. ఆ జన్యువులు నా నుంచే వెళ్లాయి. అలాంటి వాడిని కనాలంటే నా వీర్యంతోనే సాధ్యం. మస్క్ ఎలాన్ తోనూ సాధ్యం కాదు. అందుకే చాలామంది మహిళలు నా వీర్యం కోసం క్యూ కడుతున్నారు' అని పేర్కొన్నారు.

అంతేకాదు.. తన వీర్యాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? లాంటి విషయాల్ని లెక్క తేల్చేందుకు కొలంబియాలోని ఒక సంస్థకు బాధ్యతలు అప్పజెప్పారు. తాను వీర్యదానం చేసిన దానికి డబ్బులు తీసుకోవటం లేదన్నారు. తాను హైక్లాస్ మహిళలు గర్భం దాల్చటానికి మాత్రమే తన వీర్యాన్ని సదరు సంస్థ దానం చేస్తుందని చెప్పారు. తన వీర్యాన్ని కావాలనుకునే వారు తనకు ఫస్ట్ క్లాస్ ప్రయాణంతో పాటు ఫైవ్ స్టార్ హోటల్ వసతితో పాటు.. తనకు అవసరమైన సామాగ్రి మొత్తాన్ని ఇవ్వాలంటున్నారు.

ఎలాన్ మస్క్ తండ్రికి ఇప్పటివరకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యతో ముగ్గురిని.. రెండో భార్యతో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. మూడో భార్యతో మరో ఇద్దరు పిల్లల్ని కన్నాడు.ఇక.. తన వీర్యాన్ని దానం చేయటం ద్వారా చాలామందికి జన్మనిచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ప్రపంచకుబేరుడి తండ్రి విషయంలో మాత్రం.. ఇప్పటివరకు ఎప్పుడూ వినని చోద్యాలెన్నోఆయనలో కనిపిస్తాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News