గర్భిణి టీచర్‌ ని బలికొన్న కార్పొరేట్‌ స్కూల్‌ మాఫియా

Update: 2019-05-13 09:37 GMT
కాసుల కోసం కక్కుర్తి పడి విద్యార్థులతో చదువు అనే వెట్టి చాకిరి చేయిస్తున్న కార్పొరేట్‌ స్కూల్‌ మాఫియాకు ఇప్పుడొక అమాయక ఉపాధ్యాయురాలు బలైపోయింది. ఎండాకాలంలో విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా సెలవలు ఇవ్వాల్సిందే. కానీ కార్పొరేట్‌ స్కూల్స్‌ ఓరియెంటేషన్‌ క్లాసుల పేరుతో.. వచ్చే విద్యా సంవత్సరంలో మరింతమంది విద్యార్థుల్ని ఎలా స్కూల్లో చేర్చాలి అంటూ క్లాసులు నిర్వహిస్తుంటారు. ఇలాంటి వర్క్‌ షాప్‌నకు హైజరైన ఒక గర్భిణి టీచర్‌.. అధిక రక్తస్రావంతో చనిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన సుధారాణి చైతన్య స్కూల్లో హిందీ టీచర్‌ గా పనిచేస్తోంది. ఆమెకు ఇప్పుడు మూడో నెల. ఈ ఎండాకాలం  చైతన్య స్కూల్‌ యాజమాన్యం టీచర్లకు వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసింది. అది కూడా కర్నూలులో. దీంతో.. తనకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని.. ఈ ఎండలో ఇల్లు వదిలిపెడితే ఇబ్బంది అని స్కూల్‌ యాజమాన్యానికి లీవ్‌ కావాలని అడిగింది. చైతన్య స్కూల్‌ యాజమాన్యం లీవ్‌ ఇవ్వకపోగా వర్కషాప్‌ కు రాకపోతే ఉద్యోగం పోతుందని బెదిరించింది. దీంతో.. చేసేదిలేక కర్నూలులో జరిగిన వర్కషాప్‌ నకు వచ్చింది. అయితే.. ఓవైపు ఎండలు, మరోవైపు జర్నీతో అధిక రక్తస్రావం జరిగి చనిపోయింది. ఆస్పతికి తీసుకెళ్లినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు.. ఆమె చనిపోయిన విషయం బయటకు తెలిస్తే తమకు ఇబ్బంది అని గ్రహించిన స్కూల్‌ యాజమాన్యం… సుధారాణి మృతదేహాన్ని రాత్రికి రాత్రే అనంతపురానికి పంపేశారు.

సుధారాణి మరణంతో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. వేసవి సెలవుల్లో ఎలాంటి క్లాసులు, వర్క్‌షాపులు నిర్వహించకూడదని ఉన్నా.. కాసుల కక్కుర్తి కోసం ప్రైవేట్‌ స్కూల్స్ ఇలాంటి అరాచకాలకు ఒడిగడుతున్నాయని ఆరోపించారు. సుధారాణికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు స్కూల్‌ ఎదుట ధర్నా కూడా నిర్వహించాయి. ఎండాకాలం వర్క్‌ షాప్‌ నిర్వహించి సుధారాణి మరణానికి కారణమైన చైతన్య స్కూల్ లైసెన్స్‌ ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఎన్ని చెప్పినా, ప్రభుత్వాలు ఎన్ని వార్నింగ్‌ లు ఇచ్చినా ఈ కార్పొరేట్‌ స్కూల్స్‌ వ్యవహారం మాత్రం దున్నపోతు మీద వాన చందానే ఉందని విమర్శిస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.


Tags:    

Similar News