ఏపీ ఉప ముఖ్యమంత్రి నోట సెటిలర్ల మాట.. రోడ్లు పాడవుతున్నది వారితోనే

Update: 2023-05-08 10:19 GMT
సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి రాజన్న దొర. తాను చెప్పాలనుకున్నది ఏదైనా సూటిగా చెప్పేసే అలవాటు ఉన్న ఆయన.. విషయం తేడా వస్తే ఎవరిని వదిలిపెట్టకుండా దులిపేసే రకం. ఆ మధ్యన కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

తాను ప్రాతినిధ్యం వహిస్తునన నియోజకవర్గానికి అనుకొని ఉన్న ప్రాంతాలపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో విరుచుకుపడిన ఆయన.. గిరిజన సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన 'సెటిలర్ల ' మాట సంచలనంగా మారింది.

గిరిజన గ్రామాల్లో రోడ్లు వేసినా.. వంతెనలు కట్టినా వాటిని గిరిజనులు పెద్దగా ఉపయోగించరన్నారు. వాటిని ఎక్కువగా సెటిలర్లే ఎక్కువగా వినియోగిస్తారన్నారు. పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఆయన నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన రాజన్న దొర.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సెటిలర్లు ఇక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయం.. వ్యాపారాలు చేస్తున్నారన్నారు.

''సెటిలర్లు భారీ వాహనాల్ని తిప్పుతుంటారు. దీంతో రోడ్లకు గుంతలు పడుతున్నాయి. పాడైన రోడ్లకు మరమ్మతులు చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. కొట్టు పరువు పంచాయితీలో రోడ్లు వేయాలని చూస్తే.. సెటిలర్ ఒకరు తనను ఆపారన్నారు. గిరిజనులకు న్యాయం చేసేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి వరకు వెళతానని చెప్పారు.

సాలూరు మండలంలోని ప్రాంతాల్ని షెడ్యూల్ ఏరియాలుగా ప్రకటిస్తే నష్టపోయేది సెటిలర్లేనని వ్యాఖ్యానించారు. బతుకు దెరెవు కోసం.. ఇతర అవసరాల్ని సొంతం చేసుకోవటం కోసం వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలువురు సాలూరు మండలంలోని గిరిజన ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారిని సెటిలర్లుగా వ్యవహరిస్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Similar News