బన్నీ ఉత్సవాన్ని ఎప్పటికి అర్థం చేసుకుంటారో?

Update: 2019-10-09 07:04 GMT
మీరు చేసుకునే పండుగను ఒక అనాగరికమైనదంటూ ఎవరైనా అంటే ఏమనిపిస్తుంది? ఒళ్లు మండిపోదు. సంచలనాల కోసం సంప్రదాయంగా జరిగే ఒక ఉత్సవానికి తప్పుడు భాష్యం పలికే మీడియా పుణ్యమా అని రగిలిపోతుంటారు కర్నూలు జిల్లాకు చెందిన వారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని అమలు చేసేందుకు గ్రామప్రజలు కిందామీదా పడుతుంటే.. అందుకు భిన్నంగా మీడియా వక్రభాష్యం వారికి ఆవేదన కలిగించేలా ప్రచారం చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

కర్నూలు జిల్లాలో దసరా సందర్భంగా దేవరగట్టుకొండ ప్రాంతంలోని పదకొండు ఊళ్లు చేసుకునే ఉత్సవంపై ఉన్న రచ్చ అంతా ఇంతా కాదు. అక్కడి ఆచారం ప్రకారం దేవరగట్టు కొండలో మాళ మల్లేశ్వరస్వామి కళ్యాణోత్స్వం సందర్భంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఇందులో 11 గ్రామాలకు చెందిన వారు రెండు వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం వారు విగ్రహాల్ని తీసుకొని వెళుతుంటే.. వారిని ఆపే ప్రయత్నం చేయటం.. సంప్రదాయంగా జరగాల్సిన తీరులోనే విగ్రహాల్ని తిరిగి దేవరగట్టు మీద ఉంచటంతో ఉత్సవం పూర్తి అవుతుంది.

అయితే.. ఈ సందర్భంలో పదకొండు ఊళ్లకు చెందిన వారు పెద్ద పెద్ద కర్రలతో రెండు జట్లుగా విడిపోయి.. బన్నీ ఆటను ఆడతారు. లయబద్ధంగా సాగే ఈ భారీ ప్రక్రియను కర్రల సమరంగా మీడియా అభివర్ణించటంతో ఇదో హింసా క్రీడగా బయట ప్రపంచానికి ఫోకస్ అయ్యింది. దీంతో.. పోలీసులు.. కోర్టులు.. అధికారులు పరిమితుల పుణ్యమా అని ప్రతి ఏటా ఇదో ఇష్యూగా మారుతుంది.

వేలాది మంది కర్రలతో ఆడే ఆటలో కొందరి స్వార్థం కారణంగా గాయాలకు గురి అవుతుంటాయి. దీనికి తోడు మద్యం తాగిన వారు ఈ ఆట ఆడకూడదు. కానీ.. అలా ఆడే కారణంగా కొంత హింసకు కారణమవుతుందని చెప్పాలి. ఏదైనా ఇష్యూలో మంచి.. చెడు రెండు ఉంటాయి. చెడును ఎంత తగ్గించగలిగితే మంచి అంత పెరుగుతుంది. బన్నీని కర్రల సమరంగా చిత్రీకరించే కన్నా.. దాన్నో ప్రాచీన కళారూపంగా చెబితే అక్కడి స్థానికుల సెంటిమెంట్లకు గౌరవం లభిస్తుంది. కానీ.. మీడియా పుణ్యమా అని బన్నీ క్రీడపై పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఎక్కువగా ఫోకస్ అయ్యిందని చెప్పాలి.

ఈసారి బన్నీ ఉత్సవంలో ఎలాంటి హింస చెలరేగకుండా ఉండేందుకు కర్నూలు జిల్లా అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా వెయ్యి మంది పోలీసులు.. పెద్ద ఎత్తున డ్రోన్ కెమేరాలు.. యాభై ప్రాంతాల్లో కెమేరాల్ని ఉపయోగించారు. వందమంది డాక్టర్లు.. నర్సులు పని చేశారు. మొత్తంగా చూస్తే.. ఈ బన్నీ క్రీడ కారణంగా దాదాపు 60 మందికి గాయాలు అయినట్లుగా చెబుతున్నారు.

బన్నీ క్రీడను ఒక ప్రమాదకరమైన ఆటగా చూసినంత కాలం ఇలాంటివి తప్పవు. గ్రామస్తులతో.. దాన్నో ఆటగా చూస్తున్నామన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పి.. వారి సంప్రదాయానికి తామెంతో గౌరవం ఇస్తామని చెప్పటం ద్వారా.. గాయాల తీవ్రతను తగ్గించే వీలుంది. మరి.. ఆ దిశగా అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు చేసినా.. పుండు మీద కారం జల్లినట్లుగా మీడియా నోటి నుంచి వచ్చే కర్రల సమరం మాట వారి మనసుల్ని గాయపరుస్తుందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News