కొడుక్కి వార్నింగ్ ఇచ్చిన దేవ‌గౌడ‌

Update: 2018-05-01 05:01 GMT
పోటాపోటీగా సాగుతున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప్ర‌క‌ట‌న ఒక‌టి వెలువ‌డింది. గెలిచే అవ‌కాశం ఏ మాత్రం లేని జేడీఎస్ జాతీయ అధ్య‌క్షుడు మాజీ ప్ర‌ధాని దేవెగౌడ తీవ్ర స్వ‌రంతో ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కూ ఆయ‌న వార్నింగ్ ఇచ్చింది వేరెవ‌రికో కాదు.. సొంత కొడుక్కే. గెలుపు అవ‌కాశాలు లేకున్నా.. ప్ర‌భుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసే స‌త్తా లేకున్నా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కింగ్ మేక‌ర్ గా మారే అవ‌కాశం ఉంది.

అయితే.. హంగ్ ఏర్ప‌డితే బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు కుమార‌స్వామి ఉన్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించిన దేవెగౌడ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

బీజేపీతో చేతులు క‌లిపే ప్ర‌స‌క్తే లేద‌ని.. ఒక‌వేళ త‌న కొడుకు క‌మ్ మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కానీ బీజేపీ నేత‌ల‌తో చేతులు క‌లిపిన ప‌క్షంలో ఆయ‌న్ను కుటుంబం నుంచి వెలి వేస్తాన‌ని తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించారు. బెంగ‌ళూరులోని త‌న నివాసంతో మీడియాతో మాట్లాడిన దేవెగౌడ‌.. క‌ర్ణాట‌క‌లో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌న్న అంచ‌నాలు భారీగా సాగుతున్న వేళ‌లో.. ఈ వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ జేడీఎస్ ల‌ను బీ టీమ్ గా అభివ‌ర్ణిస్తున్నారు. ఇదంతా కూడా జేడీఎస్ పై సాగుతున్న కుట్ర‌గా దేవెగౌడ ఆరోపించారు. త‌న కొడుకు.. అమిత్ షా విమానంలో క‌లిసి ప్ర‌యాణించారంటూ సాగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌న్నారు. స‌ర్వేల్లో సంకీర్ణం త‌ప్ప‌ద‌న్న ప్ర‌చారం సాగుతున్న దృష్ట్యా.. కాంగ్రెస్ త‌మ‌పై కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుంద‌ని.. ఒక‌వేళ వారి ద‌గ్గ‌ర ఆధారాలు ఉంటే బ‌య‌ట‌పెట్టాలే కానీ.. లేని ఆరోప‌ణ‌లు చేసి త‌మ‌ను డ్యామేజ్ చేయ‌టం స‌రికాద‌ని దేవెగౌడ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీతో త‌న కొడుకు కుమార‌స్వామి కానీ చేతులు క‌లిపితే ఆయ‌న్ను ఇంటి నుంచి పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తాన‌ని చెప్పారు. మ‌రోవైపు కుమార స్వామి సైతం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ హంగ్ ఫ‌లితం ఏర్ప‌డితే మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌ట‌మే త‌ప్పించి.. సంకీర్ణం ఉండంటూ కుమార‌స్వామి వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

మొత్తంగా చూస్తే.. త‌మ‌కు బీజేపీకి మ‌ధ్య ఎలాంటి సంబంధం లేద‌ని.. భ‌విష్య‌త్తులో కూడా ఉండ‌బోద‌న్న న‌మ్మ‌కం క‌లిగించేలా దేవెగౌడ వ్యాఖ్య‌లు ఉన్నాయి. బీజేపీతో జేడీఎస్ కు లింకు పెట్ట‌టం ద్వారా రాజ‌కీయంగా త‌మ‌ను దెబ్బ తీసే ప్ర‌క్రియ‌కు కాంగ్రెస్ పాల్ప‌డుతుంద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేయ‌టం.. త‌మ‌కు రెండు జాతీయ పార్టీలు ఒక‌టేన‌న్న రీతిలో దేవెగౌడ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బీజేపీతో త‌మ‌కు ఎలాంటి బంధం ఉండ‌ద‌ని చెప్ప‌టం ద్వారా బీజేపీ వ్య‌తిరేక ఓటు.. కాంగ్రెస్ స‌ర్కారు మీద ఉన్న వ్య‌తిరేక ఓట్ల‌పైన దౌవెగౌడ్ దృష్టి సారించిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News