బలుపు వల్లే ఓడిపోయాం.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-06-10 15:40 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బలుపు వల్లే ఓడిపోయామన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి పాల్గొన్న దేవినేని ఉమా ఈ మేరకు హాట్‌ కామెంట్స్‌ చేశారు.

 2019 ఎన్నికల్లో నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ధీమాతోను, అహంకారం వల్లే తాను ఓడిపోయానని ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీ కూడా ఓడిపోయిందని.. ఆ బలుపు వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించారు.  పథకాలు ఇచ్చాం... వీర పథకాలు ఇచ్చాం.. అంటూ వీర తిలకాలు దిద్దుకొని ఊరేగామన్నారు. తాము గత ఎన్నికల ముందు ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ ఇచ్చాం కదాని..వీర తిలకాలు దిద్ది ఊరేగిస్తున్నారని ఊరేగామన్నారు. వైసీపీ నేతలు మాత్రం ఒక్క చాన్సు గెలిపించండమ్మా అంటూ ప్రజల కాళ్లు గడ్డాలు పట్టుకుని గెలిచేశారు అంటూ ఎద్దేవా చేశారు.

మైలవరం, నందిగామలోని వైసీపీ నేతలపై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో తండ్రి కొడుకులు (వసంత కృష్ణప్రసాద్, వసంత నాగేశ్వరరావు), నందిగామలో వసూల్‌ బ్రదర్స్‌ (మొండితోక అరుణ్‌ కుమార్, మొండితోక జగన్మోహన్‌ రావు) కొండలు, గుట్టలు తవ్వి దోచుకుంటున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు.

ఇసుక విషయానికొస్తే నందిగామ, మైలవరం , జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేలు నెలకు రూ.ఏడు కోట్లు వారి పెద్దలకు పంపిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్నటి వరకు మైలవరం ఎమ్మెల్యే ఇసుక కోసం నెలకు రూ.7 కోట్లు పంపాడన్నారు. ఇప్పుడు నందిగామ వంతు వచ్చిందని తెలిపారు. దీంతో రూ.7 కోట్ల ఇసుక సొమ్ము తాడేపల్లికి పంపుతున్నారంటూ ధ్వజమెత్తారు.

మొత్తానికి అతి విశ్వాసం, గెలుస్తామన్న ధీమా, బలుపుతోనే ఓడిపోయామని దేవినేని ఉమా తెలుసుకోవడం మంచిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి నందిగామ, మైలవరం నియోజకవర్గాలు టీడీపీ కంచుకోటలు.

అలాంటి చోట్ల గత ఎన్నికల్లో ఓడిపోవడం టీడీపీ స్వయంకృతాపరాధమేనని దేవినేని ఉమా మాటల ద్వారా తెలుస్తోంది. ఈసారైనా జాగ్రత్తపడితే ఓటమి దరిచేరకుండా చూసుకోవచ్చనే అభిప్రాయాలు టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

Similar News