జగన్ అలా ఆలోచించారంటూ.. దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

Update: 2021-01-29 10:30 GMT
ఫలానా వారు అలా అన్నారనటం కొంతవరకు సబబు. కానీ.. అలా ఆలోచించారని చెప్పటంలో పస ఉండదు. అయితే.. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి దేవినేని ఉమ. నిజం.. అబద్ధం లాంటి వాటితో సంబంధం లేకుండా సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దేవినేని తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఏపీ ఎన్నికల సంఘ కమిషనర్ కు.. ఏపీ సర్కారుకు మధ్య నెలకొన్న విభేదాల వేళ.. సుప్రీంకోర్టు ఎన్నికల్ని నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అహం దెబ్బ తిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకదశలో ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచన చేశారంటూ దేవినేని సంచలన ఆరోపణల్ని సంధించారు. అయితే.. నిఘా వర్గాల ద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయాన్ని తెలుసుకొని తోక ముడిచారంటూ వ్యాఖ్యాలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ముఖ్యమంత్రి జగన్ సుప్రీం తీర్పుతో ఎదురుదెబ్బ తగిలిందన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే పార్టీకి చెందిన ముఖ్యనేతలతో తాడేపల్లి రాజప్రసాదంలో సమావేశమైన జగన్.. తాను ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారన్నారు. అయితే.. జగన్ నిర్ణయంపై మంత్రులు.. ఎమ్మెల్యేలు నాలుగు గంటల పాటు మల్లగుల్లాలు పడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరినట్లు చెప్పారు. అదే సమయంలో నిఘా వర్గాల ద్వారా నివేదిక తెప్పించుకున్న సీఎం జగన్.. ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గుర్తించి.. తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా చెప్పారు.

ఏ క్షణంలో ఎన్నికలకు వెళ్లినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ లో కూడా సీట్లు రావన్న సమాచారంతోనే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారన్నారు. ప్రజావ్యతిరేకత సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి తన తీరుకు భిన్నంగా ఎన్నికల కమిషన్ కు సహకరిస్తామని ప్రకటించినట్లు గుర్తు చేశారు. కానీ.. తర్వాతి రోజే తన పాత నైజాన్ని తెర మీదకు తీసుకొచ్చి.. ఎన్నికల కమిషన్ పై విషం కక్కుతున్నారన్నారు.

ఏకగ్రీవాలపై మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటన ఎన్నికల నియమావళికి విరుద్దమన్న దేవినేని ఉమ.. ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యంగ బద్ధ పదవుల్లో ఉన్న స్పీకర్ తో పాటు సీఎం.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల కమిషన్ పై చేస్తున్న వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకొని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మీడియా సంస్థలకు తెలియని సమాచారం మాజీ మంత్రి దేవినేని ఉమకు ఎలా తెలిసినట్లు? ఇన్ని విషయాలు తెలుసుకున్న ఆయన.. దానికి సంబంధించిన చిన్న వీడియోక్లిప్ అయినా సంపాదించి ఉంటే మరింత బాగుండేది కదా?
Tags:    

Similar News