కంచుకోట అయిన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఫిక్స్‌!

Update: 2023-02-25 13:35 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అప్పుడే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించేశాయి. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్థితిగతులు, ప్రజల్లో ఆదరణ వంటి ప్రామాణికాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థుల ఎంపికలో ముందున్నాయి.

ఈ నేపథ్యంలో కీలకమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిని ఫిక్స్‌ చేశారని చెబుతున్నారు. చింతలపూడి నియోజకవర్గం టీడీపీకి కంచుకోటల్లో ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి కోటగిరి విధ్యాధరరావు వరుసగా ఐదుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1999 వరకు ఆయన చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేశారు. 2004లో కోటగిరి విద్యాధర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో తొలిసారి ఓటమి పాలయ్యారు.

కాగా 2004 వరకు జనరల్‌ నియోజకవర్గంగా ఉన్న చింతలపూడి 2009లో ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంగా మారింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గంటా మురళీరామకృష్ణ, మద్దాల రాజేష్‌ గెలుపొందారు. మళ్లీ 2014లో టీడీపీ అభ్యర్థి పీతల సుజాత చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2019లో వైసీపీ తొలిసారిగా చింతలపూడి నియోజకవర్గంలో పాగా వేసింది. వైసీపీ అభ్యర్థి ఎలీజా గెలుపొందారు.

ఈ నేపథ్యంలో టీడీపీ కంచుకోటల్లో ఒకటిగా ఉన్న చింతలపూడి నుంచి ఈసారి టీడీపీ కొత్త అభ్యర్థిని బరిలో దించుతోందని సమాచారం. గతంలో ఐఏఎస్‌ అధికారిగా పనిచేసి రిటైర్‌ అయిన బి.దానం కుమారుడు, విద్యావేత్త అయిన బొమ్మాజీ అనిల్‌ ను చింతలపూడికి అభ్యర్థిగా చంద్రబాబు ఫిక్స్‌ చేశారని తెలుస్తోంది. తాజాగా ఆయనను టీడీపీ రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. కొద్ది రోజుల్లో అధికారికంగా అనిల్‌ పేరును చంద్రబాబు ప్రకటిస్తారని సమాచారం.

ఈ నేపథ్యంలో అనిల్‌ కూడా గత కొద్దిరోజులుగా నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ కార్యకర్తలను కలుపుకుపోతున్నారని చెబుతున్నారు. అన్ని గ్రామాల్లో తిరుగుతూ చిన్నా పెద్దా నాయకులను కలసి మద్దతు కూడగడుతున్నారని సమాచారం.

కాగా 2019లో టీడీపీ టికెట్‌ పై చింతలపూడి నుంచి పోటీ చేసిన డాక్టర్‌ కర్రా రాజారావు ఆ తర్వాత అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి నియోజకవర్గ ఇంచార్జిగా ఎవరినీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మాజీ ఐఏఎస్‌ అధికారి బి.దానం కుమారుడు అనిల్‌ పేరు తెర మీదకు వచ్చింది.

ప్రస్తుతం అనిల్‌ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట బీఈడీ కాలేజీని నిర్వహిస్తున్నారు. విదేశాల్లో చదువుకున్న ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు. దీంతో చంద్రబాబు ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారని టాక్‌ నడుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News