ఈటల రాజీనామాపై పార్టీ నేతలతో కేసీఆర్ అంత మాట అన్నారా?

Update: 2021-06-05 04:34 GMT
దాదాపు గంట పాటు ఘాటు విమర్శలతో.. ఈటల్లాంటి మాటలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. ఆయన కుమార్తె కవితపై విరుచుకుపడిన ఈటల మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకాలం ఆచితూచి అన్నట్లు మాట్లాడిన ఆయన.. అందుకు భిన్నంగా చెలరేగిపోయారు. ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ అనంతరం..ఆయన మాటలు టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈటల నోటి నుంచి ఈ తరహాలో విరుచుకుపడటం అందరూ ఊహించిందే అయినా.. తమ అంచనాలకు జరిగినది బేరీజు వేసుకోవటంలో మునిగిపోయారు.

ఇదిలా ఉంటే.. మరికొందరు మాత్రం అధినేత కేసీఆర్ రియాక్షన్ ఏమిటన్న దానిపై ఆసక్తిని ప్రదర్శించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఈటల ప్రెస్ మీట్ ను సీఎం కేసీఆర్ ఫాలో అయినట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ ముఖ్యుల వద్ద ఈటల ఎపిసోడ్ పై కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఏమన్నది మొత్తంగా రానప్పటికీ.. ‘ఈటల.. ఇడిచిన ముల్లె’ అంటూ తనదైన శైలిలో చమత్కరించినట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. పార్టీలో ఇంకెవరైనా ఉంటే వారు కూడా వెళ్లిపోవచ్చన్న సంకేతాల్ని ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫుల్ అయిన నేపథ్యంలో.. ఎవరికైనా పదవులు రాలేదన్న బాధ ఉంటే.. అలాంటి వారంతా వెళ్లిపోవచ్చన్న రీతిలో ఆయన తీరు ఉందంటున్నారు. పార్టీని నమ్ముకొని ఉండే వారికి మంచి జరుగుతుందన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈటల ఎపిసోడ్ ను కేసీఆర్ తేలిగ్గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆయన ఆత్మవిశ్వాసంపై గులాబీ నేతలే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News