విధేయతే పదవిని తెచ్చిందా ?

Update: 2021-07-07 07:04 GMT
కంభంపాటి హరిబాబు తాజాగా వార్తల్లో వ్యక్తయిపోయారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మిజోరం గవర్నర్ గా నియమితులవ్వటమే. తాజాగా కేంద్రప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. వీరిలో ఇద్దరు తెలుగువాళ్ళున్నారు. ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా బదిలిచేశారు.

ఇదే సందర్భంలో కొత్తగా హరిబాబును మిజోరం గవర్నర్ గా మొదటిసారి నియమించటం విశేషమే. 1999లో వైజాగ్-1 ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. తర్వాత 2014-19 మధ్య విశాఖపట్నం ఎంపిగా పనిచేసిన హరిబాబుకు అప్పట్లోనే కేంద్రమంత్రిగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. ఒకదశలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయటానికి ప్రధానమంత్రి కార్యాలయం నుండి పిలుపుకూడా వచ్చిందన్నారు. అయితే ఏమి జరిగిందో తెలీదు కానీ తర్వాత ఆయన పేరే వినబడలేదు.

మొన్నటి ఎన్నికల్లో హరిబాబు ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. అప్పటికే రెండుసార్లు రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేసిన కంభంపాటి ప్రస్తుత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నట్లే అనుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత హరిబాబు రాజకీయాల్లో పెద్దగా కనబడటంలేదు. అలాంటి హరిబాబును ఏకంగా గవర్నర్ గిరినే వరించటం కాస్త ఆశ్చర్యం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కేవలం విధేయతే హరిబాబుకు పదవిని తెచ్చిందట. ఈయన మొదటినుండి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రధాన మద్దతుదారునిగా ఉంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడైనా, ఎంపి టికెట్ వచ్చినా అంతా వెంకయ్య చలవే అని పార్టీ నేతలంటున్నారు. కాబట్టి తాజాగా వరించిన గవర్నర్ పదవి కూడా వెంకయ్య వల్లే వచ్చిందని కమలనాదులే చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News