వీర్రాజు దూకుడుకు హైకమాండ్ బ్రేకులేసిందా ?

Update: 2020-12-25 05:04 GMT
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సహజంగానే మంచి దూకుడుమీదుంటారు. ఏదో ఓ ఆరోపణతో ప్రత్యర్ధులపై రెచ్చిపోవటం ఆయన స్వభావం. ఇదే పద్దతిలో మిత్రపక్షం అని కూడా చూడకుండా జనసేనను బుల్డేజ్ చేసేద్దామని ప్రయత్నిస్తున్నారు. దీనికి తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికను అవకాశంగా తీసుకుందామని ప్రయత్నించారు. ప్రయత్నం వరకు బాగానే ఉన్నా జాతీయ నాయకత్వం బ్రేకులు వేయటంతో స్పీడు తగ్గించుకుని యూ టర్న్ తీసుకోవాల్సొచ్చింది.

వీర్రాజు అధ్యక్షుడైన దగ్గర నుండి జనసేనను కానీ దాని అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ఏ విషయంలో కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోవటం లేదు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని దాదాపు మూడు నెలల క్రితమే ప్రకటించేశారు. వీర్రాజు ఏకపక్షంగా చేసిన ఈ ప్రకటనను అప్పట్లో జనసేన పట్టించుకోలేదు. ఎందుకంటే ఉపఎన్నికలో తమపార్టీయే పోటీ చేయాలని పవన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. అందుకనే చాపకింద నీరులాగ తన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టే వీర్రాజు ప్రకటనకు పెద్దగా విలువ్వలేదు.

అయితే ఈమధ్యనే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నుండి జనసేన అభ్యర్ధులను బీజేపీ నేతలు విత్ డ్రా చేయించారు. అప్పటి నుండి తిరుపతి ఉపఎన్నికలో పోటీ విషయంలో పవన్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తిరుపతిలో జరిగిన బీజేపీ రెండు రోజుల కార్యవర్గ సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ బీజేపీనే పోటీ చేస్తుందని ప్రకటించేశారు. జనసేన మద్దతుతో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్ధికి ఓట్లేసి గెలిపించాలని శోభాయాత్ర సందర్భంగా పిలుపివ్వటంతో పవన్ కు బాగా మండింది.

ఇదే విషయాన్ని పవన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడినట్లు సమాచారం. వెంటనే వీర్రాజుకు ఫోన్ చేసి నడ్డా ఇదే విషయమై వివరణ అడిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తం మీద వాళ్ళిద్దరు ఏమి మాట్లాడుకున్నారో తెలీదు. అయితే మదనపల్లిలో పర్యటన సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ తిరుపతి ఉపఎన్నికలో ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేయాలనే విషయమై రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.

తమ రెండు పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేసినా రెండోపార్టీ పూర్తి మద్దతుతో పనిచేస్త్తుందని చెప్పటం ఇంకా విచిత్రం అనిపించింది. మిత్రపక్షాలన్నాక సహకరించుకోకుండా ఉలా ఉంటారు ?  ఈ విషయాన్ని వీర్రాజు ప్రత్యేకంగా చెప్పాలా ? ప్రత్యేకంగా చెప్పారంటేనే లోలోపల మిత్రపక్షాల మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తం మీద వీర్రాజు లాంటి బయటకు మాట్లాడకపోయినా పవన్ మాత్రం సైలెంట్ గా పనిచేసి బీజేపీ అధ్యక్షుని దూకుడుకు బ్రేకులు వేసినట్లే అర్ధమైపోతోంది.
Tags:    

Similar News