అశ్వనీదత్ కేసులో అసలు విషయం బయటకు వచ్చిందా ?

Update: 2020-09-29 07:15 GMT
చంద్రబాబునాయుడు హయాంలో టేకప్ చేసిన రాజధాని అమరావతి ప్రాజెక్టు కేవలం రియల్ ఎస్టేట్ వ్యవహారమే అన్న విషయం తాజాగా బయటపడింది. సినీదర్శకుడు అశ్వనీదత్ హైకోర్టులో వేసిన కేసుతో అసలు విషయం బయటకు వచ్చిందని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతి రాజధాని నిర్మాణం కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే అంటూ వైసిపి నేతలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసింది. తాజాగా అశ్వనీ వేసిన కేసుతో ఆ ఆరోపణలకు మద్దతు దొరికనట్లయ్యింది.

ఇంతకీ దత్ విషయం ఏమిటంటే గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసమని గన్నవరం ప్రాంతంలో తమకున్న సుమారు 40 ఎకరాలిచ్చినట్లు చెప్పారు. ఎయిర్ పోర్టు విస్తరణకు తాము ఇచ్చిన భూములకు బదులుగా అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం తమకు భూములు, అభివృద్ది చేసిన ప్లాట్లను ఇస్తానని హామీ ఇచ్చిందట. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి తర్వాత ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ బిల్లుతో పాటు సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసిన విషయాన్ని దత్ గుర్తుచేశారు. ప్రభుత్వం చేసిన పనివల్ల తనకు బాగా నష్టం వచ్చిందట. అందుకనే ప్రభుత్వం తనకు రూ. 210 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకెక్కారు.

తామ విమానాశ్రయానికి ఇచ్చిన మొత్తం భూమి విలువకు ఇపుడు నాలుగురెట్లు చెల్లించాలని కోర్టులో కేసు వేయటమే హైలైట్. రు. 210 కోట్ల పరిహారంతో పాటు ల్యాండ్ రెంటును కూడా చెల్లించాలంటూ డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు విమానాశ్రయం విస్తరణకు అశ్వనీదత్  భూములిస్తే దానికి బదులుగా అమరావతి ప్రాంతంలో భూములు కేటాయించటం ఏమిటో అర్ధం కావటం లేదు. దీన్నే వైసిపి నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఆరోపిస్తున్నారు.   గన్నవరం ప్రాంతంలో భూములిస్తే అక్కడే ఏదో చోట భూములివ్వాల్సిన ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో భూములు ఎలా ఇస్తుందంటూ చంద్రబాబునాయుడును నిలదీస్తున్నారు.

విమానాశ్రయం విస్తరణకు దర్శకుడితో పాటు చాలామంది రైతులు తమ భూములను ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఒక్క దత్ కు మాత్రమే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో భూములిచ్చారా ? లేకపోతే భూములిచ్చిన రైతులకు అందరికీ ఇక్కడ భూములిచ్చారా అన్నది తేలాలంటూ డిమాండ్లు మొదలుపెట్టారు. గన్నవరం ప్రాంతంలో ఇచ్చిన భూముల విలువెంత ? అమరావతి ప్రాంతంలో తీసుకున్నపుడు ఆ భూముల విలువ ఎంత ? అన్న విషయమై క్లారిటి ఇవ్వాలంటూ వైసిపి ఎంఎల్ఏ అంబటి రాంబాబు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. తాజాగా అశ్వనీదత్ వేసిన కేసుతో  వైసిపి నేతల ఆరోపణలనే బలపరచినట్లయ్యింది. మరి కోర్టులో ఏమి తేలుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News