ఏపి సీడ్స్ వల్ల అధికార పార్టీ ఎంఎల్ఏనే నష్టపోయారా ?

Update: 2020-10-30 00:30 GMT
ఏపి సీడ్స్ లో విత్తనాలు కొనుగోలు చేసి అధికారపార్టీ ఎంఎల్ఏనే నష్టపోతే ఎలాగబ్బా ? ఏపి సీడ్సంటే రైతులందరికీ ఓ విధమైన భరోసా. ఇక్కడ కొనుగోలు చేసిన విత్తనాల నాణ్యతపై అందరిలోను ఓ విధమైన నమ్మకం ఉంటుంది. అలాంటిది ఇక్కడ వరి విత్తనాలు కొని తాను నష్టపోయినట్లు మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డే మొత్తుకుంటున్నారు. మొత్తుకోవటమే కాదు ఏకంగా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కే ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది.

ఇంతకీ విషయం ఏమిటంటే నియోజకవర్గంలోని తన గ్రామం వేమవరంలోని తన 13 ఎకరాల్లో వరి పంటను వేద్దామనుకున్నారు ఎంఎల్ఏ. అందుకనే జూన్ లో నారుమడిపోసి, ఆగష్టులో నాట్లువేశారు. ఇందుకు గాను వరి విత్తనాలను ఏపి సీడ్స్ నుండి ఆళ్ళ కొనుగోలు చేశారు. నాలుగు రోజుల క్రితం తన పొలంలోకి వెళ్ళి కంకులను పరిశీలించారు. అయితే రావాల్సిన పద్దతిలో కంకులు రాలేదన్న విషయాన్ని గ్రహించారు.

కంకులను పరిశీలించిన తర్వాత 5 ఎకరాల్లో సరైన దిగుబడి రాదన్న విషయం ఎంఎల్ఏకి తెలిసిపోయింది. అలాగే తప్పు ఎక్కడ జరిగిందో కూడా అర్ధమైంది. వెంటనే ఎంఎల్ఏ వ్యవసాయ జేడీ విజయభారతికి ఫిర్యాదు చేశారు. సరైన దిగుబడి రాని వరి పంటపై విచారణ జరిపించాలంటూ ఎంఎల్ఏ ఫిర్యాదుచేశారు. ఇదే విషయమై  విజయభారతి మాట్లాడుతూ ఎంఎల్ఏ ఫిర్యాదు కారణంగా బాపట్లలోని వ్యవసాయ శాస్త్రజ్ఞులను విచారణ చేయమని కోరినట్లు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంఎల్ఏకే నాసిరకం విత్తనాలను అంటకడితే ఇక మామూలు రైతుల సంగతిని ఎవరు పట్టించుకుంటారు. ఏపీ సీడ్స్ ఉత్పత్తి చేస్తున్న విత్తనాలను లక్షల క్వింటాళ్ళల్లో రైతులు కొటుంటారు. వివిధ పంటలకు సంబంధించే కాకుండా ఒక్క వరిలోనే ఏపీ సీడ్స్ 21 రకల విత్తనాలను ఉత్పత్తి చేస్తోంది. విత్తనాల నాణ్యతను పరిశీలించాల్సిన విభాగం, అధికారులు ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలీదు. ఇపుడు ఎంఎల్ఏ విషయం బయటపడింది. మరి విత్తనాలు కొన్న లక్షలాది మంది రైతులకు కూడా నాసిరకం విత్తనాలే అందితే వాళ్ళను ఎవరు పట్టించుకుంటారు ? అధికారపార్టీ ఎంఎల్ఏకే నాసిరకం విత్తనాలు అంటగట్టారంటే ఇక మామూలు రైతుల సంగతి చెప్పేదేముంది ?
Tags:    

Similar News