రజనీని సర్వేనే భయపెట్టిందా ?

Update: 2021-01-01 17:30 GMT
కొత్తపార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇద్దామని అనుకున్న రజనీకాంత్ మొత్తానికి కాడి దింపేశాడు. సంవత్సరాలు పాటు అభిమానులను ఊరించి ఊరించి చివరకు పార్టీ పెడతానని స్వయంగా ప్రకటించిన రజనీ చివరి నిముషంలో ఎందుకు పాలిటిక్స్ లోకి రావటం లేదని ప్రకటించాల్సొచ్చింది ? ఇపుడిదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. తమిళ మీడియా ప్రకారం తాను చేయించుకున్న సర్వేనే రజనీని బ్యాక్ స్టెప్ వేయించినట్లు సమాచారం.

ఇంతకీ విషయం ఏమిటంటే తాను రాజకీయాల్లోకి వస్తే జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే విషయమై రజనీ ఓ సర్వే చేయించుకున్నారట. అందులో జనాల అభిప్రాయాలు, స్పందనలు చూసిన తర్వాత పార్టీ పెట్టకపోవటమే మేలన్న విషయం తలైవాకు బాగా అర్ధమైందట. ఇంతకీ సర్వేలో ఏముంది ? ఏముందంటే అసలు రజనీ ఈ వయసులో పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఏమి చేయగలడని జనాలు నిలదీశారట.

దశాబ్దాలుగా తమిళనాడులో తిరుగులేని ఇమేజి ఉన్న రజనీ సమాజానికి చేసిన సేవ ఏమిటో చెప్పాలని సర్వే బృందాన్ని జనాలు ఎదురు ప్రశ్నించారట. అసలే అనారోగ్యాలతో బాధపడుతున్న రజనీ ఇప్పటికిప్పుడు వచ్చి రాజకీయాల్లో ఏదో చేసేస్తాడనే భ్రమలు తమకు లేవన్న విషయాన్ని జనాలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. ఇవన్నీ పక్కనపెట్టేసినా రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓట్లేస్తారని అడిగినపుడు రజనీ పెట్టబోయే పార్టీకి ఓట్లేస్తామని పెద్దగా చెప్పలేదట.

అంటే దీన్నిబట్టి రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించిన బృందానికి రజనీ పార్టీ పెట్టినా మహా అయితే ఓ 20 సీట్లు రావచ్చని అనిపించిందట. దాంతో తమ నివేదికను రజనీ కుటుంబసభ్యులకు అందిచారని సమాచారం. ఆ నివేదికలోని అంశాలను చదివిన తర్వాత భార్య, కూతుర్లు, అల్లుడు హైదరాబాద్ నుండి తిరిగివచ్చిన రజనీతో ఇదే విషయాన్ని చర్చించారట.

అన్నీ వైపుల నుండి మొదలైన ఒత్తిడి పొలిటికల్ ఎంట్రీ విషయం నుండి రజనీ బ్యాక్ స్టెప్ వేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని అభిమానులకు లేఖ రూపంలో తెలియజేశారు. మొత్తానికి అనారోగ్యం, వయస్సుతో పాటు సర్వే నివేదిక కూడా రజనీని బాగానే భయపెట్టినట్లు తమిళమీడియా కోడై కూస్తోంది.
Tags:    

Similar News