అక్క‌డ తెలుగు త‌మ్ముళ్లు సైకిల్‌ను మూల‌న ప‌డేశారా

Update: 2019-10-07 14:30 GMT
రాష్ట్రంలో అధికార ప‌క్షం చేస్తున్న త‌ప్పుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగాల్సిన స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పిల్లిమొగ్గ‌లు వేస్తోందా?  నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త‌లేక‌పోవ‌డంతో పార్టీ పూర్తిగా దెబ్బ‌తినిపోతాందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను విశ్లేషిస్తున్న‌వారు ఔన‌నే అంటున్నారు. ముఖ్యంగా పార్టీని మంచి ఊపులోకి తీసుకువ‌స్తార‌ని, పార్టీకి అన్ని విధాలా సాయంగా ఉంటార‌ని భావించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు చాలా జిల్లాల్లో చుక్కెదుర‌వుతోంది. నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ త‌మ దారి తాము చూసుకుంటున్నారు.

ముఖ్యంగా రాజ‌కీయ చైత‌న్యం ఉన్న నెల్లూరులో పార్టీ నేత‌లు త‌లోదారి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక్క‌డ ఎన్నిక‌ల‌కు ముందు అంద‌రు నాయ‌కులు ఐక‌మ‌త్యంగా ముందుకు సాగారు. ఈ క్ర‌మంలోనే జిల్లా లో పార్టీ దూకుడు ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఎన్నిక‌లు ముగిసి, టీడీపీ పూర్తిగా చేతులు ఎత్తేసిన త‌ర్వాత‌.. ప‌రిస్థితి మారిపోయింది. నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం, రూర‌ల్ నియోజక‌వ‌ర్గాల్లో పార్టీని న‌డిపించేవారు లేకుండా పోయారు అంతేకాదు.. ఏ మాత్రం అవకాశం వ‌చ్చినా.. పార్టీ నుంచి జంప్ చేసి అధికార పార్టీలోకి వెళ్లాల‌ని భావిస్తున్న‌వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న ఐక‌మ‌త్యం నాయ‌కుల మ‌ధ్య క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబుకు ఎంతో ముఖ్యుడిగా పేరు తెచ్చుకున్న నారాయ‌ణ ఇప్ప‌టి వ‌ర‌కు బాబును క‌లిసింది కూడా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయాల్లో ఉండ‌డంతో వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయ‌ని.. ఈ రాజ‌కీయాలు మ‌న‌కు వ‌ద్ద‌ని నారాయ‌ణ‌పై ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఒత్తిడి చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక కొద్ది రోజుల క్రిత‌మే నారాయ‌ణ కుమార్తె సైతం జ‌గ‌న్‌ను క‌లిసిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇక‌, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన అజీజ్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో కార్య‌క్ర మాల‌కు హాజ‌రైంది లేదు. వైసీపీ మేయ‌ర్‌గా గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత టీడీపీలోకి జంప్ చేసి చివ‌ర్లో రూర‌ల్ సీటు ద‌క్కించుకున్నా ఓడిపోయారు. ఇక‌, త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌య్యే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల హోరులో తాము పోటీ చేస్తామంటూ.. ముందుకు వ‌చ్చే నాయ‌కుల‌కు కూడా టీడీపీలో వెతుకులాడే ప‌రిస్థితి నెల‌కొంది. ఇదంతా ఎందుకు జ‌రుగుతోంది?  సీనియ‌ర్ లు ఏం చేస్తున్నారు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పేవారు కూడా లేక పోవ‌డం నెల్లూరు టీడీపీని మ‌రింత‌గా వేధిస్తోంది. మ‌రి బాబు ఎలాంటి కాయ‌క‌ల్ప చికిత్స చేస్తారో చూడాలి.
Tags:    

Similar News