అసద్ తాజా మాట విన్నారా? మజ్లిస్ పోటీ టీఆర్ఎస్ తోనేనట

Update: 2020-11-22 17:10 GMT
మేం స్నేహితులం.. మా మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని.. రాజకీయాలకు ఏ మాత్రం సూట్ కాని మాటల్ని చెప్పే గులాబీ బాస్ కు తగ్గట్లే తాజాగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్.. మజ్లిస్ సర్కార్ అంటూ ఓటర్లను తమకు అనుకూలంగా కనెక్టు చేసుకునేలా ప్రచారం చేస్తున్న బీజేపీ పుణ్యమా అని కేటీఆర్.. మజ్లిస్ అధినేత మాటలు మారుతున్నాయి.

మజ్లిస్ తో తమకు పొత్తు లేదని అదేపనిగా చెబుతున్న కేటీఆర్ మాటలకు తగ్గట్లే.. తాజాగా ఆపార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం స్పందించారు. తమకు టీఆర్ఎస్ తో పొత్తు లేదన్న ఆయన.. అసలు తమకు పోటీ టీఆర్ఎస్సేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో తమకు ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేసిన అసద్.. చాలా చోట్ల టీఆర్ఎస్సే తమకు పోటీ అని పేర్కొన్నారు.

హైదరాబాద్ కు వరదలు వస్తే.. కేంద్రం సాయం చేయలేదన్న ఆయన.. హిందుత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ముస్లింలకు లేదా? అంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. గడిచిన ఐదేళ్లలో టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాల్ని ఏ మాత్రం ప్రస్తావించకుండా.. బీజేపీ మీద విమర్శలు చేయటం గమనార్హం. మొత్తానికి మిత్రులు ఎవరికి వారు తాము మిత్రులం కాదని.. పొత్తు లేదని చెబుతున్న వైనం చూస్తే.. బీజేపీ ప్రచారం ఆ పార్టీల్ని ఇబ్బంది పెడుతుందన్న విషయం అర్థమైనట్లే.
Tags:    

Similar News