డిగ్గీరాజాకు ఏపీ నేత‌ల షాక్ అదిరింది!

Update: 2017-09-13 12:27 GMT
జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు ఒక‌ప్పుడు కంచుకోటగా ఉన్న ఏపీ.. ఇప్పుడు ఆపార్టీని చెత్త‌బుట్ట‌లోకి విసిరికొట్టిన‌ట్టు కొట్టింది. దీంతో నేత‌ల‌కు మైండ్ బ్లాంక్ అవుతోంది. రాష్ట్ర విభ‌జన ఎఫెక్ట్ ఇంకా కాంగ్రెస్‌పై పోక‌పోవ‌డాన్ని నేత‌లు తీవ్రంగా భావిస్తున్నారు. ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన నంద్యాల‌ - కాకినాడ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ దారుణాతి దారుణమైన ప‌రిస్థితిని చ‌విచూసింది. దీంతో 2019లో ఆస‌లు మ‌ళ్లీ గ‌ల్లంత‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనిని గ‌మ‌నించిన అధిష్టానం ఇప్ప‌టి నుంచే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది.

దీనిలో భాగంగా ఆ రెండు ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంపై చ‌ర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌ చార్జ్ దిగ్విజ‌య్ సింగ్ ఉర‌ఫ్ డిగ్గీరాజా స్టేట్ నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు వెల్ల‌డించిన విష‌యాల‌తో ఆయ‌న‌కు దిమ్మ తిరిగిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉందని నేత‌లు  కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ప‌రిస్థితి ఇలానే ఉంటే జెండా పీకేయాల్సి వ‌చ్చినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర‌లేద‌ని చెప్పుకొచ్చార‌ట‌. అదేవిధంగా నేత‌లు ఇప్ప‌టికే వైసీపీలోకి జంప్ అయిపోయార‌ని, మ‌రింత మంది జంప్ చేసేందుకు రెడీగా ఉన్నార‌ని కూడా డిగ్గీ రాజాకు వివ‌రించార‌ట‌.

డిగ్గీతో భేటీ అయిన వారిలో  కేవీపీ రామచంద్రరావు - జేడీ శీలం - కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి - సి రామచంద్రయ్య - కాసు వెంకటకృష్ణారెడ్డి వంటి ఉద్ధండులు ఉన్నారు. వీరంతా ఒకే ఒక మాట‌గా రాష్ట్రంలో పార్టీని ఇప్ప‌టి నుంచి ప‌టిష్టం చేయ‌క‌పోతే - అధిష్టానం ప‌ట్టించుకోక‌పోతే.. జెండా పీకేయాల్సిన ప‌రిస్థితి వస్తుంద‌ని చెప్పార‌ట‌.  అనంత‌రం వీరితో మాట్లాడిన డిగ్గీరాజా.. నంద్యాల బైపోల్‌ - కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఓట‌మి స‌హా ఓట్లు పుంజుకోక‌పోవ‌డంపై  సోనియా గాంధీ సీరియస్‌ గా ఉన్నారని వెల్ల‌డించార‌ట‌.   ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత విషయాలపై చర్చించేందుకు ఓసారి ముఖ్య నేతలంతా ఢిల్లీకి రావాలని దిగ్విజయ్ ఆహ్వానించారు.  దీంతో ఏపీ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పరిస్థితిపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఏదేమైనా.. స్థానిక నేత‌లే కాంగ్రెస్ గురించి ఇలా ఓ నిర్ణ‌యానికి రావ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.
Tags:    

Similar News