శశికళ పోటీపై క్లారిటీ ఇచ్చిన దినకరన్​.. !

Update: 2021-02-07 10:50 GMT
తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అక్కడ డీఎంకే అధినేత స్టాలిన్​ గెలుపు పక్కా అని అంతా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆరోగ్య కారణాలతో రజనీ కాంత్​ కూడా పార్టీ పెట్టడం లేదు. మక్కల్​ నీది మయ్యం పార్టీ పేరుతో పోటీచేస్తున్న కమల్​ హాసన్​ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో తమిళ పాలిటిక్స్​లోకి శశికళ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ గెలిచినా.. ఓడినా రాజకీయాలపై ఆమె బలంగా ప్రభావం చూపుతుందని తమిళనాట టాక్​ వినిపిస్తోంది.

ఓ వైపు ఆమె ఏఐఏడీఎంకే ను హస్తగతం చేసుకొనేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అయితే జయలలిత చనిపోయిన తర్వాత శశికళ పార్టీపై పట్టు బిగించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. అయితే సరిగ్గా ఇదే టైంలో ఆమె అవినీతి ఆరోపణలతో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. దీంతో ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. ప్రస్తుతం శశికళ జైలు జీవితం పూర్తిచేసుకొని విడుదలయ్యారు.

ఆమె విడుదల కాకముందే కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఈ నెల 8న శశికళ తమిళనాడులో పర్యటిస్తారని సమాచారం. ఇందుకోసం ఆమె అనుచరులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే శశికళ ఏం మాట్లాడబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. మరోవైపు ఆమె ఈ ఎన్నికల్లో పోటీచేస్తారా? లేదా? అన్న విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో శశికళ మేనల్లుడు ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్​ సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె పోటీచేస్తారని పేర్కొన్నారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆమె త్వరలో రాష్ట్రవాప్తంగా పర్యటించనున్నారు. ఆమె పర్యటనలో హింస చెలరేగే అవకాశం ఉందంటూ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News