ఢిల్లీ పోలీసుల‌కు దిన‌క‌రన్ మొత్తం చెప్పేశాడా?

Update: 2017-04-25 06:14 GMT
రాజ‌కీయ నేత‌ల నోటి నుంచి నిజం క‌క్కించ‌టం అంత తేలికైన విష‌యం కాదు. నేరం చేసి.. వాటికి ఆధారాలు చూపించిన త‌ర్వాత కూడా బుకాయించ‌టం.. తాము ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెప్ప‌టం మామూలే. సాదాసీదా నేత‌లు ఇలాంటి ట‌క్కు ట‌మరా విద్య‌ల్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అలాంటిది ఒక అధికార‌పార్టీని త‌న క‌నుస‌న్న‌ల్లో కంట్రోల్ చేసే పొజిష‌న్లో ఉండే వ్య‌క్తి ఇంకెంత‌గా చెల‌రేగిపోతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. అయితే.. అలాంటి ప‌ప్పులేమీ ఉడ‌క్కుండా ఢిల్లీ పోలీసుల ప్లానింగ్ తో అన్న‌డీఎంకే ఉప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టీటీవీ దిన‌క‌ర‌న్‌ కు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్ అయ్యే షాకిచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

పార్టీ గుర్తు అయిన రెండాకుల్ని ర‌క్షించుకోవ‌టం కోసం.. కేంద్ర ఎన్నిక‌ల సంఘ స‌భ్యుల‌కు రూ.50కోట్ల మేర లంచం ఏర వేసేందుకు ప్లాన్ చేసిన దిన‌క‌ర‌న్ అడ్డంగా బుక్ కావ‌టం తెలిసిందే. ఎన్నిక‌ల చిహ్నాన్ని సొంతం చేసుకోవ‌టం కోసం.. ఇలాంటి ప‌నులు చేసే ఒక బ్రోక‌ర్‌ను ఢిల్లీలో కలిసి.. అత‌నితో చ‌ర్చ‌లు జ‌రిపిన వైనం ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. అందుకు సంబంధించిన వీడియో ఒక‌టి ఢిల్లీ  పోలీసు అధికారులు చూపించేస‌రికి.. దిన‌క‌ర‌న్ నోటి నుంచి మాట రాని ప‌రిస్థితి నెల‌కొన్న‌ట్లుగా చెబుతున్నారు. తాను ఎలాంటి బ్రోక‌ర్‌ను క‌ల‌వ‌లేద‌ని.. అస‌లు అత‌నితో ఎలాంటి ప‌రిచ‌య‌మే లేద‌ని బుకాయించిన దిన‌క‌ర‌న్ కు అధికారులు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌మ విచార‌ణ‌లో భాగంగా దిన‌క‌ర‌న్‌ ను ప‌లు ప్ర‌శ్న‌లు వేసిన‌ప్ప‌టికీ.. ఆయ‌న నోటి నుంచి ఎలాంటి స‌మాధానం రాలేద‌ట‌. దీంతో.. చివ‌రి అస్త్రంగా త‌మ ద‌గ్గ‌రున్న వీడియోను ప్ర‌ద‌ర్శించార‌ని.. దీంతో.. దిన‌క‌ర‌న్ నోటి వెంట మాట రాలేద‌ని చెబుతున్నారు. ఆదివారం.. సోమ‌వారం రెండు ద‌ఫాల్లో గంట‌ల కొద్దీ విచారించిన సంద‌ర్భంలో.. అధికారులు బొమ్మ‌తో మొత్తం విష‌యాల్ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రోవైపు బ్రోక‌ర్ సుఖేశ్‌ తో దిన‌క‌ర‌న్‌ కు సంబంధాలున్నాయ‌న్న విష‌యాన్ని ఆయ‌న స‌హాయ‌కుడు జ‌నార్ద‌న‌న్‌.. క‌ర్ణాట‌కు చెందిన స్నేహితుడు మ‌ల్లికార్జున కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఇలా అన్ని వైపుల నుంచి ఢిల్లీ పోలీసులు ఫిక్స్ చేయ‌టంతో.. ఏం చేయాలో తోచ‌ని ప‌రిస్థితుల్లోకి దిన‌క‌ర‌న్ జారిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ నుంచి హైకోర్టు జ‌డ్జి మాట్లాడుతున్నార‌న్న ఉద్దేశంతో ఫోన్ కాల్ తీసుకున్నాన‌ని చెప్పి త‌ప్పించుకునేందుకు దిన‌క‌ర‌న్ ప్ర‌య‌త్నం చేయ‌గా.. పోలీసులు బ్రోక‌ర్ తో క‌లిసి స్టార్ హోటల్లో జ‌రిపిన చ‌ర్చ‌ల వీడియోను బ‌య‌ట‌పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ఆయ‌నింకేమీ మాట్లాడ‌లేక‌పోయార‌ని.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో నోరు విప్ప‌క త‌ప్ప‌లేద‌ని అంటున్నారు. తాజా ప‌రిణామాల‌తో సుఖేశ్‌తో ప‌రిచ‌యం.. తాను డ‌బ్బును ఢిల్లీకి ఎలా పంపించింది.. కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో ఎవ‌రికి డ‌బ్బులు ఇవ్వాల‌నుకున్న‌ది? అందుకు నిధులు ఎక్క‌డ నుంచి సిద్ధం చేయాల‌నుకున్న విష‌యాల్ని పోలీసులు రాబ‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌వేళ‌.. అదే నిజ‌మైతే.. దిన‌క‌ర‌న్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News