చిన్న‌మ్మ మేన‌ల్లుడి యాగం..ఆ ఇద్ద‌రిలో క‌ల్లోలం

Update: 2017-08-19 12:59 GMT
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో రాజకీయ వేడి మ‌రింత ముదిరింది. రెండాకుల పార్టీలోని మూడు వర్గాలు కాస్త రెండు వ‌ర్గాలుగా మారేందుకు సమావేశాలు - చర్చల్లో నిమగ్నమయిన ఎపిసోడ్‌లో మ‌రో ప‌రిణామం చోటుచేసుకుంది. అన్నాడీంకే వర్గాల విలీనం విషయంలో పన్నీర్‌ సెల్వం - పళనిస్వామిలు తమ వ్యూహాలకు పదునుపెట్టడానికి విడివిడిగా సమావేశాలు నిర్వహించి చ‌ర్చ‌ల‌ను ఓ కొలిక్కి వ‌చ్చిన సంగ‌తి తెలిందే. వీరిని ఎదుర్కొనేందుకు చిన్న‌మ్మ శ‌శిక‌ళ నేతృత్వంలోని టీటీవీ దినకరన్‌ బెంగళూరు జైల్లో ఉన్న శశికళతో భేటీ అయ్యారు. అయితే దీని తదుపరి ఆయ‌నో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకొని అడుగువేశారు.

మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం - తాజా సీఎం ప‌ళ‌నిస్వామి వ‌ర్గం ఒక్క‌ట‌వుతున్న నేప‌థ్యంలో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ శత్రుసంహార హోమం నిర్వహిస్తున్నారు. శివగంగై జిల్లా పెరమాలై ఆలయంలో హోమం చేస్తున్నారు. బెంగళూరు జైల్లో శశికళను కలిసినప్పుడు హోమం నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చెన్నైలోని ప్రముఖ హోటల్‌ లో సమావేశం అయిన త‌న‌ వర్గ ఎమ్మెల్యేలతో చ‌ర్చించుకొని ఈ హోమానికి దిన‌క‌ర‌న్ సిద్ధ‌మ‌య్యారని తెలుస్తోంది.  ఈ పరిణామం తాజా - మాజీ సీఎం వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపింది.

చిన్న‌మ్మ మేన‌ల్లుడి చ‌ర్య‌పై ముఖ్య‌మంత్రి  పళనిస్వామి వర్గం మండిప‌డింది. ప్రభుత్వం తన గుప్పిట్లో ఉండాలనే దినకరన్‌ హోమం చేస్తున్నారని మండిప‌డింది. దినకరన్‌ హోమంపై సీఎం పళనిస్వామి వర్గం విమర్శలు గుప్పిస్తూ పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవాలనే వారి లక్ష్యమన్నారు. న్యాయం - ధర్మం ఉన్న వారివైపే దేవుడు ఉంటాడన్నారు. మ‌రోవైపు ఎఐఎడిఎంకె వర్గాలు రెండూ విలీనమయ్యేందుకు మార్గం సుగమమవుతున్నట్లు ఒక వర్గం నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. ఎఐఎడిఎంకె రెండు వర్గాల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో సానుకూల ఫలితం వెలువడే అవకాశముందని పన్నీర్‌ సెల్వం చెప్పారు. తన నేతృత్వంలోని ఎఐఎడింఎకె (పురచ్చి తలైవి అమ్మ) వర్గం నేతలతో పన్నీర్‌ సెల్వం పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

అన్నాడీఎంకే వర్గాల విలీనం కోసం ఇదివరకు పన్నీర్‌ సెల్వం వర్గం కమిటీని వేసి తర్వాత రద్దు చేసుకుంది. అలానే ప్రస్తుతం మరోసారి విలీనానికి సంబంధించిన చర్చలకు ఒక స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనకు పన్నీర్‌ సెల్వం వర్గం వచ్చినట్లు సమాచారం. ఇందులో ఏడు నుంచి తొమ్మిది మంది ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీని ద్వారా పన్నీర్‌కు ఉప ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులతోపాటు, తన వర్గంలోని వారికి మంత్రి పదవులు సాధించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
Tags:    

Similar News