తెలంగాణ కాంగ్రెస్ లో నిరాశ..

Update: 2023-02-26 15:23 GMT
కాంగ్రెస్ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా అనేక చర్చలకు దారి తీస్తోంది. చత్తీస్ గఢ్ లోని  రాయపూర్ లో నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ నా తొలి ఇన్నింగ్స్ కంప్లీట్ అయిందని సంచలన కామెంట్ చేశారు. అలాగే తన రాజకీయ జీవితం గురించి అక్కడున్న వాళ్లతో పంచుకున్నారు. దీంతో సోనియగాంధీ రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నారా? అన్న చర్చ సాగుతోంది.

అయితే ఆ విషయాన్ని సోనియాగాంధీ ఫుల్ క్లారిటీతో ఇవ్వకపోయినా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే అర్థమవుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకులు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా తెలంగాణకు సోనియా దేవత అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటే పరిస్థితి ఏంటనే చర్చ లో మునిగారు.

సుధీర్ఘకాలంగా కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టిన సోనియాగాంధీ ఇక నుంచి సాధారణ కార్యకర్తగానే ఉండిపోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీని వెనకుండి నడిపించాల్సిన ఆమె సడెన్లీగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ నాయకుల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంతకాలం కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లోనైనా బలంగా ఉందంటే అందుకు సోనియాగాంధీనే కారణమని తెలుస్తోంది. ఇక తెలంగాణలోని నాయకులు ప్రతీ ప్రసంగంలో సోనియాగాంధీ పేరెత్తకుండా ఉండరు. ఎందుకంటే సోనియా హాయాంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్వవైభవం రావాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సభలు, సమావేశాలు, పాదయాత్రల పేరుతో ప్రజలకు దగ్గరయ్యేందుకు శ్రమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు అన్ని రకాల న్యాయం జరుగుతుందని నమ్మజెబుతున్నారు.

ఇలాంటి సమయంలో సోనియాగాంధీ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేయడం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర నిరాశ కలుగుతోంది. సోనియాగాంధీ తెలంగాణ దేవత అని కీర్తిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న నేతలకు ఇప్పుడు ఆమె నామమాత్ర కార్యకర్తగా ఉంటే కాంగ్రెస్ కు ఎవరు దిక్కని ప్రశ్నించే ప్రమాదం ఉంది.

సోనియగాంధీ తప్పుకుంటే కాంగ్రెస్ ను ఎవరూ బాధ్యతగా తీసుకుంటారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం జాతీయాధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గేను నియమించినా తెలంగాణలో ఆయన మార్పులు తీసుకొస్తారా? అని చర్చించుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News