వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేకి గుండెపోటు!

Update: 2023-02-08 14:11 GMT
వైసీపీ కంచుకోటల్లో ఒకటైన నెల్లూరు జిల్లాలో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఒకరైన మేకపాటి చంద్రశేఖరరెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నై తరలించే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖరరెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చి 2011లో వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు మద్దతుగా అప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున తొలి నాళ్లలో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఒకరిగా చంద్రశేఖరరెడ్డి నిలిచారు.

2004, 2009, 2012 (ఉప ఎన్నిక), 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు చేతిలో ఓడిపోయారు.

కాగా కొద్ది రోజుల క్రితం తన నియోజకవర్గంలో ధనుంజయరెడ్డి అనే పరిశీలకుడి పెత్తనం ఎక్కువ అయ్యిందని మేకపాటి చంద్రశేఖరరెడ్డి మండిపడ్డ సంగతి తెలిసిందే. ఆయనను తొలగించాలని జిల్లా మంత్రికి, సీఎం జగన్‌ కు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. టీడీపీకి చెందిన ధనుంజయరెడ్డిని పరిశీలకుడిగా నియమించడం ఏమిటని నిలదీశారు. తన నియోజకవర్గంలో టీడీపీ వ్యక్తిని పరిశీలకుడిగా నియమించడంపై మండిపడ్డారు.

దీంతో వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కోరిక మేరకు ధనుంజయరెడ్డిని నియోజకవర్గ పరిశీలకుడిగా తొలగించింది. అయితే ఆయన స్థానం మరో ధనుంజయరెడ్డిని నియమించడం విశేషం. ఈ మేరకు వైసీపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటివరకు ఉదయగిరి పరిశీలకుడిగా కొడవలూరు ధనుంజయరెడ్డి ఉండగా ఆయన స్థానంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డిని పరిశీలకుడిగా నియమించింది.

కాగా గతేడాది మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్న మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి గౌతమ్‌ రెడ్డి ... వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన సోదరుడు మేకపాటి విక్రాంత్‌ కు వైసీపీ సీటు కేటాయించింది. ఉప ఎన్నికలో మేకపాటి విక్రాంత్‌ భారీ మెజారిటీతో గెలుపొందారు.

మళ్లీ ఇంతలోనే మేకపాటి గౌతమ్‌ రెడ్డి బాబాయ్‌ మేకపాటి చంద్రశేఖరరెడ్డికి గుండెపోటు రావడం గమనార్హం. దీంతో ఆయనను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలిస్తారని చెబుతున్నారు. మరి కాసేపట్లో నెల్లూరు అపోలో వైద్యులు ఆయన హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News