చింత‌మ‌నేని ఎమ్మెల్యే ప‌ద‌వికి ఎస‌రు?

Update: 2018-02-15 10:48 GMT
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు భీమ‌డోలు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ పై దాడి చేసిన ఘ‌ట‌న‌లో చింత‌మ‌నేనికి  కోర్టు రెండేళ్ల జైలు శిక్ష - రూ.వెయ్యి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వ‌సంత‌కుమార్ పై దాడి చేయ‌డంతో పాటు అప్ప‌టి ఎంపీ కావూరి సాంబశివరావుపై చింత‌మ‌నేని దౌర్జన్యానికి పాల్పడ్డాడని వట్టి వసంత్‌ కుమార్‌ గన్‌ మెన్‌ ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం కేసు నమోదు చేశారు. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టినప్ప‌టి నుంచి దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న చింత‌మ‌నేనికి తాజా కోర్టు తీర్పు ఇర‌కాటంలో పడేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. 1996 నుంచి చింతమనేనిపై 42 కేసులు  న‌మోదైన నేప‌థ్యంలో తాజా తీర్పుతో అయ‌న రాజకీయ జీవితం ప్ర‌శ్నార్థ‌క‌మైంది. ప్ర‌స్తుతం చింత‌మ‌నేనికి రెండేళ్ల శిక్ష‌పడటంతో కచ్చితంగా  విప్‌ పదవికి రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అంతేకాకుండా, ఎమ్మెల్యేగా చింత‌మ‌నేనిపై అనర్హత వేటు పడే అవకాశం కూడా ఉంది.

అయితే, సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తే చింతమనేనికి ఊరట లభించే అవ‌కాశం కూడా ఉంది. అలాకాకుండే, శిక్ష ప‌డితే ఎమ్మెల్యేగా వైదొల‌గ‌డ‌మే కాకుండా 2019 ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉండ‌క‌పోవ‌చ్చు. 2011 నవంబర్ 26న‌ దెందులూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సంద‌ర్భంగా అప్పటి మంత్రి వసంతకుమార్‌ - ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావుల పై చింతమనేని దౌర్జ‌న్యం చేశారు. వసంత్ కుమార్ ను ప్ర‌భాక‌ర్ దుర్భాషలాడుతూ చెయ్యి కూడా చేసుకున్నారు. వ‌సంత‌కుమార్ గన్‌మెన్ ను పక్కకు నెట్టేయ‌డంతో ఆయ‌న ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ప్ర‌భాక‌ర్ తో పాటు 14 మందిపై కేసు న‌మోదైంది. అయితే, చింతమనేనికి భయపడి కొంద‌రు అధికారులు సాక్ష్యం చెప్పలేదు. గ‌త నెలలో వసంత కుమార్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్ప‌డం - ఆ ఘ‌ట‌న‌ వీడియోలు ఉండటంతో చింత‌మ‌నేనికి శిక్ష ప‌డింది. చింత‌మ‌నేనికి వ్య‌తిరేకంగా పూర్తి సాక్ష్యాధారాలు ఉండటంతో భీమడోలు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి కె.దీప దైవకృప నిష్ప‌క్ష‌పాతంగా తీర్పు చెప్పారు. ఈ తీర్పుతో చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మేన‌ని ఆమె నిరూపించారు.


Tags:    

Similar News