డీఎల్ తాజా దారి ఇదేనట!

Update: 2022-03-14 09:30 GMT
పేరు చెప్పినంతనే కేరాఫ్ కాంగ్రెస్ పార్టీగా చెప్పే సీనియర్ నేతగా డీఎల్ రవీంద్రారెడ్డి గుర్తుకు వస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ను వదిలి వెళ్లిన నేతలు పలువురు ఉంటే.. డీఎల్ లాంటివాళ్లు.. తాము మరణించిన తర్వాత కూడా తమ భౌతికకాయం మీద కాంగ్రెస్ జెండానే ఉంటుందని గొప్పగా చెప్పేవారు. రాజకీయ నేతల నోటి నుంచి వచ్చే మాటలు నీటి మీద రాతలుగా చెప్పటం తెలిసిందే.

అందుకు డీఎల్ సైతం మినహాయింపు కాదు.  కాంగ్రెస్ పని అయిపోయిందని.. ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే అవకాశం లేదని తేలిపోయిన నేపథ్యంలో.. టీడీపీకి వెళ్లిన ఆయన.. అక్కడ తాను ఉండలేక.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నించటం తెలిసిందే.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న డీఎల్.. ఆయన మరణం తర్వాత.. జిల్లాలో ఆయన ఛరిష్మా కూడా తగ్గిందనే చెప్పాలి. ఎన్నికలకు ముందు జగన్ ను కలిసినప్పటికీ.. ఆయన చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకోని ఆయన.. తాను అధికార పార్టీలో చేరలేదన్న మాటను చెబుతుంటారు. అయితే.. అసలు విషయం అది కాదని.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని చెప్పిన జగన్.. తన హామీని అమలు చేయని కారణంగా గుర్రుగా ఉన్న ఆయన.. ఇప్పుడు మరో పార్టీకి వెళ్లే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు.

కడప జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో ఉన్నప్పటికీ తనకు ఎలాంటి ప్రయోజనం కలగదన్న దానిపై క్లారిటీ రావటంతో పాటు.. ఇప్పటికే జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన రమేశ్ యాదవ్.. బద్వేల్ కు చెందినడీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వటంతో.. డీఎస్ కు అవకాశాల్లేవన్న విషయం తేలిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉంటే తగిన ప్రాధాన్యత లభించదన్న ఆలోచనతో ఉన్న ఆయన ఆలోచన మారినట్లుగా చెబుతున్నారు.

మళ్లీ రాజకీయాల్లో బిజీ కావాలని తపిస్తున్న ఆయన.. తనకున్న మార్గాల గురించి అన్వేషిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు టీడీపీకీ కానీ ఇటు వైసీపీలోకి కానీ వెళ్లలేని పరిస్థితి. అందుకే.. ఆయన కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా వినిపిస్తున్న వాదనల్ని పరిగణలోకి తీసుకుంటే ఆయన.. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగియటంతో పాటు.. పార్టీలోకి చేరే ముహుర్తాన్ని కూడా నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

ఈ నెల 19న కడపలో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో కమలనాథుల చేతి నుంచి కాషాయ కండువాను కప్పుకోవటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అంతేకాదు.. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన - బీజేపీ పొత్తులో భాగంగా ఆయన మైదకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యన రాజకీయాల్లో వెనుకబడిన ఆయన.. ఇప్పటికైనా దూసుకెళతారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News