ప‌వ‌న్‌ను అమ‌ర‌ణ దీక్ష...చేయిస్తోంది ఎవ‌రో తెలుసా?

Update: 2019-11-05 06:31 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఊహించ‌ని ఇర‌కాటంలో ప‌డ్డారు. భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు అండ‌గా ప‌వ‌న్ చేసిన కార్యాచ‌ర‌ణ కేంద్రంగా ఆయ‌న్ను టార్గెట్ చేశారు. ఇసుక లభ్యత లేకపోవడం మూలంగా అయిదు నెలల నుంచి ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల కష్టాలను అందరికీ తెలిపేందుకు ఆదివారం విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేపట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నెలల తరబడి ఉపాధి లేక రోడ్డునపడ్డారు... వారి కష్టాలను రెండు వారాల్లోగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అయితే, ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో...ప‌వ‌న్ అమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయ‌నున్నార‌నే ప్ర‌చారం తెర‌మీద‌కు రాగా....దాన్ని తోసిపుచ్చేందుకు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది.

సోష‌ల్ మీడియాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమరణ దీక్ష చేస్తారని కొంద‌రు ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ఎక్క‌డా తేడా రాకుండా...జ‌న‌సేన పార్టీ లెటర్‌ హెడ్‌ పై పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ పేరిట ప్రెస్ నోట్ సృష్టించి చెలామ‌ణిలో పెట్టారు. దీంతో ప‌వ‌న్ ఆమ‌ర‌ణ దీక్ష అని పేర్కొంటూ...గడువులోగా ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లోనే భవన నిర్మాణ కార్మికులకు అండగా నడుస్తాను అని జనసేన అధ్యక్షుడు ప్రకటించారని....అనంత‌రం ఆయ‌న ఆమ‌ర‌ణ దీక్ష చేయ‌నున్నార‌ని వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 17వ తేదీన ఉద‌యం ప‌వ‌న్ ఆమ‌ర‌ణ దీక్ష‌కు కూర్చుంటార‌నే సారాంశంతో ఉన్న‌ ఆ న‌కిలీ ప్రెస్‌ నోట్‌ తో ..ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్...అటు జ‌న‌సేన పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ స్వ‌యంగా పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి ఆ ప్ర‌చారాన్ని ఖండించింది. 'జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమరణ దీక్ష చేస్తారు అని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. తప్పుడు సమాచారంతో పార్టీ లెటర్ హెడ్‌ పై పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ పేరిట ప్రెస్ నోట్ సృష్టించారు. అసత్యమైన ఆ ప్రెస్ నోట్‌ను ఎవరూ విశ్వసించవద్దు. ఈ తప్పుడు లేఖను సృష్టించి, ఫోర్జరీ సంతకం చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ లీగల్ విభాగం సన్నద్ధమైంది. '' అని వివ‌ర‌ణ ఇచ్చుకుంది.
Tags:    

Similar News