కేసీఆర్ వ‌ద్ద ఈ ప్ర‌శ్న‌లకు జవాబు ఉందా?

Update: 2022-10-08 12:30 GMT
జాతీయ రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున దేశ‌వ్యాప్తంగా అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించి త‌న స‌త్తా చాటాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. త‌ద్వారా కేంద్రంలో అధికార బీజేపీకి షాకివ్వాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీకి అనుకూలంగా, వ్య‌తిరేకంగా అనేక కామెంట్స్ వ‌స్తున్నాయి.

ముఖ్యంగా కేసీఆర్‌.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు త‌దిత‌ర రాష్ట్రాలపై ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో తెలుగు ప్ర‌జ‌లు భారీగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే వారి ఓట్ల‌తోపాటు ఆయా రాష్ట్రాల్లో రైతుల‌ను ఓట్లను కొల్ల‌గొట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను దూషించిన కేసీఆర్ పార్టీని ఏపీలో ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని వివిధ పార్టీల నేత‌ల‌తోపాటు సాధార‌ణ ప్ర‌జ‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. నెటిజ‌న్లు అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై మండిప‌డుతున్నారు.

అన్న‌దమ్ముల్లా క‌లిసి ఉన్న ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌ల‌ను విడ‌గొట్టి.. వారిలో విద్వేష భావాలు రేపింది కేసీఆర్ కాదా అని నిల‌దీస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఏపీ సంస్కృతిని, వంట‌ల‌ను త‌క్కువ చేసి మాట్లాడ‌టం, హైద‌రాబాద్లో ఏపీకి చెందిన‌వారి ఆస్తుల‌పై దాడులు చేయించ‌డం, పండుగ‌ల‌కు హైద‌రాబాద్ నుంచి ఏపీకి వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకోవ‌డం, ఏపీ నుంచి వ‌చ్చే హైద‌రాబాద్‌కు వ‌చ్చేవారిని స‌రిహ‌ద్దు జిల్లాలైన న‌ల్గొండ‌, కృష్ణా, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ త‌దిత‌ర చోట్ల అడ్డుకోవ‌డం, బ‌స్సుల‌పై రాళ్లు వేయించ‌డం, చివ‌ర‌కు చావు బ‌తుకుల్లో ఉండి వైద్యం కోసం హైద‌రాబాద్‌కు అంబులెన్సుల్లో వ‌స్తున్న‌వారిని కూడా రానీయ‌కుండా అడ్డుకోవ‌డం.. ఇలా అనేకం కేసీఆర్ చేశార‌ని, చేయించార‌ని గుర్తు చేసుకుంటున్నారు.

ఏపీ ప్ర‌జ‌ల‌ను దోపిడీదారులుగానూ, వ‌ల‌స పాల‌కుల‌ని దూషించ‌డం, బ్రిటిష‌ర్ల‌తో పోల్చ‌డం ఇలా లెక్కకు మిక్క‌లి త‌ప్పులు ఏపీ ప్ర‌జ‌ల విష‌యంలో కేసీఆర్ చేశార‌ని గుర్తు చేసుకుంటున్నారు. బీజేపీ మత ప్రాతిప‌దిక‌న విద్వేష రాజ‌కీయాలు చేస్తే.. కేసీఆర్ కూడా త‌క్కువేమీ తిన‌లేద‌ని ప్రాంతం ప్రాతిప‌దిక‌గా విద్వేష రాజ‌కీయాలు చేశార‌ని గుర్తు చేస్తున్నారు. అనేక విధాలుగా ఏపీ ప్ర‌జ‌ల‌ను దూషించి వారి మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచిన కేసీఆర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీకి బీఆర్ఎస్ పార్టీ పేరుతో వ‌స్తార‌ని నిల‌దీస్తున్నారు.

ఇప్ప‌టికే వైసీపీ, ఏపీ బీజేపీ నేత‌లు కేసీఆర్ పై మండిప‌డుతున్నారు. కేసీఆర్ వ‌చ్చినా, కేసీఆర్ తాత వ‌చ్చినా ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని వైసీపీ మంత్రులు తేల్చిచెబుతున్నారు. ఇక ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అయితే మ‌రో అడుగు ముందుకేసి కేసీఆర్ ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

అస‌లు ప్రాంతీయ‌త‌త్వంతో సంకుచిత ధోర‌ణి ఉన్న కేసీఆర్.. భార‌త రాష్ట్ర స‌మితి అంటూ పార్టీ ఏర్పాటు చేయ‌డ‌మే వింత‌ల్లోకెల్లా వింత అని నెటిజ‌న్లు ఎద్దేవా చేస్తున్నారు. ప్రాంతాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టి కేసీఆర్ ప‌బ్బం గ‌డుపుకునే ర‌క‌మ‌ని.. ఆయ‌న జాతీయ పార్టీ ఏర్పాటు ద్వారా దేశం మొత్తాన్ని ఎలా ఏకం చేస్తార‌ని నిల‌దీస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ జాతీయ భావాలున్న వ్యక్తిగా అస‌లు ఎవ‌రైనా చూస్తారా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

తెలంగాణ‌ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా ఆంధ్రుల‌పై సంద‌ర్భానుసారం కేసీఆర్, ఆ పార్టీ నేత‌లు విషం చిమ్ముతూనే వ‌స్తున్నార‌ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. ఇప్ప‌టికీ పోల‌వరం ప్రాజెక్టును పూర్తి చేయ‌నీయ‌కుండా కిరికిరిలు పెట్ట‌డం, శ్రీశైలం ప్రాజెక్టులో అక్ర‌మ నీటి వినియోగం ద్వారా ఏపీని కేసీఆర్ ఇబ్బంది పెడుతూనే వ‌స్తున్నార‌ని గుర్తు చేస్తున్నారు.  అలాంటి వ్యక్తి త‌న‌కు జాతీయ భావనలున్నట్లు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News