షర్మిల పార్టీకి ఇంత సీనుందా ?

Update: 2022-04-26 07:31 GMT
'తమకు ఏ పార్టీతో పొత్తులు ఉండవు..టీఆర్ఎస్ తో  సహా బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల ఓట్లను తమ పార్టీ చీలుస్తుంది'..ఇదీ తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు. షర్మిల చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత అందరికీ ఒక అనుమానం మొదలైంది.

అదేమిటంటే ఏ పార్టీతో తమకు పొత్తులుండదు అని షర్మిల చెప్పటం వరకు ఓకే. అసలు షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఏ పార్టీ అనుకుంటున్నది ? పొత్తులు పెట్టుకోవాలని ఏ పార్టీ అయినా షర్మిల చుట్టూ తిరుగుతోందా ?

ఇక టీఆర్ఎస్ తో పాటు అన్నీపార్టీల ఓట్లను చీలుస్తామని చెప్పటం కూడా విచిత్రమే. ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ప్రతి పార్టీకి, ప్రతి అభ్యర్ధికి ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి. అభ్యర్థి ఎవరో తెలియకపోయినా ? అసలు ప్రచారమే చేయకపోయినా ? ముక్కు మొహం తెలీకపోయినా సదరు అభ్యర్ధికి ఓట్లేసేవాళ్ళుంటారు. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో కేఏ పాల్ పెట్టిన  ప్రజాశాంతి పార్టీ తరపున పోటీచేసిన వారికి కూడా పదో పరకో ఓట్లొచ్చాయి.

పది ఓట్లు వచ్చినంత మాత్రాన తమ పార్టీ ఇతర పార్టీల ఓట్లను చీల్చేసిందని షర్మిల సబంరపడితే పడచ్చు. పార్టీ పెట్టి ఏడాదైనా ఇంకా ఉనికి చాటుకోవటం కోసమే షర్మిల నానా అవస్థలు పడుతున్నది వాస్తవం.

అసలు షర్మిల నాయకత్వంలో ఒక పార్టీ ఉన్నదనే విషయాన్ని కూడా ఇతర పార్టీలు గుర్తించటానికి ఇష్టపడటం లేదు. తన ఉనికిని చాటుకోవటం కోసమే షర్మిల పాదయాత్రలని, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల పరామర్శలని, నిరాహార దీక్షలని అవస్థలు పడుతున్నారు.

నిజానికి షర్మిల పార్టీ పెట్టకముందు తెలంగాణాలో ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుందన్నట్లుగా మీడియా, సోషల్ మీడియాలో వార్తలు, కథనాలు వచ్చాయి. తీరా పార్టీ పెట్టిన తర్వాత ఏమైందో ఏమో అప్పటివరకు ఆమెను అంటిపెట్టుకుని ఉన్న కొద్దిమంది వెళ్ళిపోయారు. చివరగా తన అన్న జగన్మోహన్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవని షర్మిల స్పష్టం చేయడం కొసమెరుపు.
Tags:    

Similar News