డొక్కా నామినేష‌న్‌ కు తిర‌స్క‌ర‌ణ త‌ప్ప‌దా?

Update: 2017-03-07 04:34 GMT
టీడీపీ నేత‌ల గుండెల్లో గుబులు రేగింది. వైసీపీతో పోటీ ప‌డి ఓడిపోవ‌డ‌మెందుక‌ని రాజీ మార్గం ఎంచుకున్న టీడీపీ నేత‌ల‌కు గుబులెందుక‌నేగా మీ ప్ర‌శ్న‌.  ఈ విష‌యం తెలిస్తే... నిజంగానే టీడీపీ నేత‌ల గుండెల్లో గుబులు రేగింద‌ని మీరు కూడా ఒప్పేసుకుంటారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నిన్న ప‌లు ఆస‌క్తి ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల‌కు సంబంధించి ఖాళీగా ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఏడు నామినేష‌న్లే దాఖ‌ల‌య్యాయి. అసెంబ్లీలో అధికార‌, విప‌క్ష పార్టీలు త‌మ‌కున్న ఎమ్మెల్యేల బ‌లం ఆధారంగా ఐదింటికి టీడీపీ నామినేష‌న్ వేస్తే.. వైసీపీ రెండు స్థానాల‌కు నామినేషన్ వేసింది. ఏడు స్థానాల‌కు ఏడే నామినేష‌న్లు దాఖలైన నేప‌థ్యంలో రెండు పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగానే ఎన్నికైన‌ట్లైంది. అయితే నామినేష‌న్ల‌కు గ‌డువు నేటి సాయంత్రం దాకా ఉండ‌టం,  ఆ త‌ర్వాత నామినేష‌న్ ప‌త్రాల ప‌రిశీల‌న కార్య‌క్ర‌మం కూడా ఉండ‌టంతో రేపు సాయంత్రానికి గానీ వీరి ఎన్నికను అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశాలు లేవు.

ఒక ద‌శ‌లో ఆరో స్థానానికి కూడా పోటీ చేద్దామంటూ టీడీపీ భావించినా... పోలింగ్ జ‌రిగితే వైసీపీకి విజ‌యావ‌కాశాలు అధికంగా ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు అండ్ కో...ఆ దిశ‌గా అడుగు వేయ‌లేకపోయారు. అయితే నిన్న‌టి నామినేష‌న్ల సంద‌ర్భంగా టీడీపీ ఓ పెద్ద పొర‌పాటే చేసింది. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నారా లోకేశ్ తో పాటు ఆ పార్టీ ఎంపిక చేసిన అభ్య‌ర్థులు క‌ర‌ణం బ‌ల‌రాం - బ‌చ్చుల అర్జునుడు - పోతుల సునీతలు ప్ర‌స్తుతం ఎలాంటి అధికారిక ప‌ద‌వుల్లో లేరు. అయితే టీడీపీ ఎంపిక చేసిన మరో అభ్య‌ర్థి - మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం ఏపీ ప్ర‌భుత్వంలోని క‌నీస వేత‌నాల క‌మిటీ చైర్మ‌న్‌ గా ఉన్నారు. అధికారిక ప‌ద‌విలో ఉన్న నేత అభ్య‌ర్థిత్వం... ఎమ్మెల్సీ  ఎన్నిక కాదు క‌దా... మిగ‌తా ఏ ఎన్నిక‌ల్లోనూ చెల్ల‌దు. అయితే ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు స‌హా ఆయ‌న పార్టీ నేత‌లంతా మ‌రిచిపోయారు. ఈ విష‌యాన్నే ప‌ట్టించుకోని ఆ పార్టీ నేత‌లు డొక్కాతో ఆర్బాటంగా నామినేష‌న్ వేయించారు.

డొక్కా నామినేష‌న్ కు వ‌చ్చిన సంద‌ర్భంగా గుంటూరు జిల్లా నుంచే కాకుండా విజ‌యవాడ‌, ప్ర‌త్యేకించి రాజ‌ధాని ప‌రిధిలోని గ్రామాల‌కు చెందిన టీడీపీ నేత‌లు - కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌రలివ‌చ్చారు. అయితే వీరిలో ఏ ఒక్క‌రికి కూడా క‌నీస వేత‌నాల క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వికి డొక్కా రాజీనామా చేయ‌కుండా నామినేష‌న్ వేస్తే చెల్ల‌ద‌న్న విష‌యం తెలియ‌లేదు. పాల‌న‌పై  సుదీర్ఘ అనుభవం ఉంద‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకునే చంద్ర‌బాబుకే ఈ విష‌యం గుర్తుకు రాక‌పోతే... మిగ‌తా వారికి రాక‌పోవ‌డంలో ఆశ్చ‌ర్య‌మేమీ లేదు క‌దా. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగిగా సుదీర్ఘ కాలం ప‌నిచేసి ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన డొక్కాకు కూడా ఈ విష‌యం గుర్తుకు రాకపోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో నామినేష‌న్ల ప‌రిశీల‌న సంద‌ర్భంగా డొక్కా నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురి కావ‌డం ఖాయ‌మే. అయితే నామినేష‌న్లు వేసి అంతా వెళ్లిపోయిన త‌ర్వాత ఎవ‌రో ఈ అంశాన్ని టీడీపీ నేత‌ల వ‌ద్ద ప్ర‌స్తావించార‌ట‌. అంతే క్ష‌ణాల్లో ఈ విష‌యం టీడీపీ నేత‌ల‌కంతా తెలిసిపోగా... అంతా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే అప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త మంత్రాంగం ర‌చించిన టీడీపీ నేత‌లు... డొక్కా నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురి కాకుండా ఓ ప‌క్కా ప్ర‌ణాళిక‌ను ర‌చించార‌ట‌. ఆ ప్ర‌ణాళిక ఏమిట‌న్న విష‌యం ఇప్ప‌టికైతే సస్పెన్సే కానీ.. నేటి సాయంత్రంలోగా అది బ‌య‌ట‌ప‌డ‌టం ఖాయమేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News