హెచ్1-బీ వీసాదారులకు పెద్ద షాక్!

Update: 2018-04-24 11:45 GMT
అగ్ర‌రాజ్యం..అవ‌కాశాల స్వ‌ర్గం అనే పేరున్న అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌దుప‌రి వెలువడుతున్న అనేక షాకింగ్ న్యూస్‌ ల‌లో తాజా ప‌రిణామం ఇది. నైపుణ్యవంతులైన భార‌తీయుల‌కు క‌లిసివ‌చ్చిన‌ హెచ్1-బీ వీసా ద్వారా పెద్ద షాక్ ఇవ్వడానికి ట్రంప్  సిద్ధమయ్యారు. ఈ వీసాలు ఉన్న వారి భాగస్వాములకు ఇప్పటివరకు ఉన్న వర్క్ పర్మిట్‌ ను రద్దు చేసేందుకు ఆయ‌న ఆలోచన చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి చట్టసభ ప్రతినిధులకు వెల్లడించారు. తాజా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక ఆదేశాల సాయంతో వీళ్లు తమ భాగస్వాములకు వర్క్ పర్మిట్ పొందగలిగారు. అయితే ఇప్పుడది ఎత్తేసేందుకు ట్రంప్ స‌ర్కారు స‌న్నాహాలు చేస్తోంది.

హెచ్1-బీ వీసాలు ఉన్నవారి భాగస్వాములకు హెచ్-4 వీసాలు జారీ చేస్తారు. ఈ హెచ్1-బీ వీసాలు పొందినవాళ్లలో ఇండియన్సే ఎక్కువగా ఉన్నారు. హెచ్1-బీ వీసాదారులు పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో వాళ్లు భాగస్వాములకు పని చేసే అనుమతి ఇస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మైగ్రేషన్ పాలసీ ఇన్‌ స్టిట్యూట్ తాజా అధ్యయనం ప్రకారం ఇప్పటివరకు 71 వేల మంది హెచ్1-బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్ పర్మిట్ ఇచ్చినట్లు తేలింది. ఇందులో 90 శాతం మంది ఇండియన్సే కావడం గమనార్హం. 71 వేల మందిలో 94 శాతం మహిళలే కాగా.. 93 శాతం మంది ఇండియన్స్ అని ఆ అధ్యయనం తేల్చింది.

ఇంత భారీ సంఖ్య‌లో మ‌నవాళ్లకు అవ‌కాశం క‌ల్పిస్తున్న ఆదేశాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తున్నది. దీనిపై త్వరలోనే అధికారికంగా సమాచారం అందిస్తాం అని యూఎస్ సిటిజెన్‌ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా ఓ లేఖలో సెనేటర్ చక్ గ్రాస్లీకి చెప్పారు.హెచ్-4 వీసాలతో ప్రస్తుతం 70 వేల మంది వర్క్ పర్మిట్ పొందారు. తాజా ప్ర‌తిపాద‌న అమ‌ల్లోకి వ‌స్తే...వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపనుంది.
Tags:    

Similar News